ఏపీలో వైసీపీ నేతలు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది అనేది వాస్తవం. అయితే ఇది కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయనే కారణం అయితే కాదు. ఓ వైపు 40 శాతం ఓట్ షేర్ ఉన్న పార్టీలో ఉన్నామని గొప్పగా చెబుతున్నప్పటికీ… లోపల మాత్రం అధినేత జగన్‌పై రగిలిపోతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు తమ మాటను అధినేత వైఎస్ జగన్ కనీసం పట్టించుకోలేదనే కోపం ఇప్పుడు పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయింది. తాడేపల్లి కోటరీతో పాటు అధినేత నిర్లక్ష్యం వల్లే తామంతా ఎన్నికల్లో ఓడిపోయామనేది మాజీల మాట. దీంతో తమలో ఉన్న కోపాన్ని బయటకు చెప్పలేక ఈ విధంగా సైలెంట్‌గా ఉన్నారనే మాట బలంగా వినిపిస్తోంది.
గతంలో జగన్‌పై ఈగ వాలకుండా వైసీపీ నేతలు కంచుకోటలా నిలుచున్నారనేది వాస్తవం. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే… జగన్ పైన, వైసీపీ పైన విపక్షాలు విమర్శలు చేస్తే… ఘాటుగా బదులిచ్చారు. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకు వేసి మరీ వ్యక్తిగత దూషణలు కూడా చేశారు. అయితే ఇదంతా గతం. తిరుమల లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యి వ్యవహారంలో మాత్రం జగన్ ఒంటరేనని తేలిపోయింది. తొలి రోజున మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి హడావుడి చేశారు తప్ప… ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వంటి నేతలు ఒకటి రెండు సార్లు అలా బయటకు వచ్చి ఏదో స్టేట్‌మెంట్లు ఇచ్చారు తప్ప… మళ్లీ కనిపించటం లేదు. ఇందుకు ప్రధాన కారణం… నాటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యవహరించిన తీరే అనే మాట బలంగా వినిపిస్తోంది. టీటీడీలో ఏకఛత్రాధిపతిగా ధర్మారెడ్డి వ్యవహరించారు. చివరికి సీఎంవో నుంచి వచ్చిన సిఫారసు లేఖలను కూడా కొన్ని సందర్భాల్లో తిరస్కరించారు. అలాగే ఆయనకు నచ్చిన వారికి మాత్రం ఒక లేఖపైన పది మంది, 20 మందికి కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతి ఇచ్చారు. దీంతో నాటి ఈవో ధర్మారెడ్డి తీరుపై అప్పట్లోనే వైసీపీ నేతలు పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు.
Read Also : గుడివాడ కి కొడాలి నాని గుడ్ బై.. జగన్ తో వాడివేడి సమావేశం
ప్రస్తుతం జగన్‌కు రాజకీయంగా తోడు నిలిచిన నాయకులు కనిపించటం లేదు. దీనికి ప్రధాన కారణం జగనే. కేవలం సలహాదారుల మాటలు విని మంత్రిస్థాయి నేతలను కూడా కలవకుండా దూరంగా పెట్టిన జగన్ కోసం ఎందుకు మాట్లాడాలనే భావనలో నేతలున్నట్లు తెలుస్తోంది. పైగా తిరుమల ప్రసాదం వంటి సున్నితమైన విషయంలో మాట్లాడటం వల్ల భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని కూడా భయపడుతున్నారు. అదే సమయంలో జగన్ చుట్టూ ఇప్పటికే ఓ భజన బృందం నడుస్తోంది. వీరి వల్ల పార్టీకి పైసా కూడా ఉపయోగం లేదంటున్నారు సొంత పార్టీ నేతలు. అందుకే కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ప్రెస్‌మీట్ పెట్టాలని, ఆందోళనలు చేపట్టాలని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ.. వాటిని పెద్దగా నేతలెవరు పట్టించుకోలేదు. చివరికి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత వైద్యునిపై దాడి చేస్తే… స్థానిక వైసీపీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు.
కేసులకు భయపడవద్దని… తననే 16 నెలలు జైలులో పెట్టారంటూ కేడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అయితే నేతలు మాత్రం జగన్ జైలుకు వెళ్లింది అక్రమాస్తుల కేసులో కదా… ప్రజా పోరాటం చేసి కాదు కదా… అని గుసగుసలాడుకుంటున్నారు. అలాగే 2014-19 మధ్య కాలంలో పార్టీ కోసం పని చేసిన వారిలో ఎంతమందికి జగన్ పదవులిచ్చారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. పార్టీ కోసం పాటుపడిన వారిని పక్కన పెట్టిన జగన్… భజన చేసిన వారికే పెద్ద పీట వేశారని విమర్శిస్తున్నారు. ఇందుకే జగన్ స్వయంగా పిలుపు ఇస్తున్నప్పటికీ.. పార్టీ నేతలు మాత్రం… బయటకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు.