పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం ఏదీ అంటే.. అంతా ఠక్కున చెప్పే మాట ఉత్తరాంధ్ర. ఉపాధి అవకాశాలు లేక ఎంతో మంది ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు కూడా వలసలు వెళ్తున్న పరిస్థితి. కుటుంబాలకు దూరంగా.. సరైన గూడు లేక ఇతర ప్రాంతాల్లో నానా పాట్లు పడుతున్నారు. పోరాటాల పురిటిగడ్డ మన శ్రీకాకుళం అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా సరే.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులోని పైడి భీమవరం వద్ద ఫార్మా సెజ్ ఉన్నప్పటికీ.. నిత్యం కాలుష్య కోరల్లో చిక్కుకున్న స్థానికులు.. ఊర్లకు ఊర్లు ఖాళీ చేస్తున్న పరిస్థితులు. స్థానిక పరిస్థితులను ఇంత కాలం కేవలం ఓట్లుగా మాత్రమే రాజకీయ పార్టీల నేతలు పరిగణించారు తప్ప.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెద్దగా చేసిన మేలు ఏమీ లేదనే చెప్పాలి.
Also Read : పవన్ సూపర్.. భయపడేది లేదు: చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
గత వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల పేరుతో విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారు మాజీ సీఎం వైఎస్ జగన్. అయితే.. నాటి ప్రభుత్వంలో అభివృద్ధి కంటే కూడా.. విశాఖ పరిసరాల్లో భూకబ్జాలు పెరిగిపోయాయనే మాట బహిరంగ రహస్యం. తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. అన్ని ప్రాంతాల అభివృద్ధి పై దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేవలం విమాన రాకపోకల కోసమే కాకుండా.. ఏవియేషన్, ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ఏర్పాటు దిశగా కూటమి సర్కార్ అడుగులు వేసింది. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న భారత్.. ఏవియేషన్ రంగంలో మాత్రం వెనుకబాటుకు గురైందనేది వాస్తవం. భవిష్యత్తు తరాలకు అపారమైన అవకాశాలున్నప్పటికీ.. ఈ రంగం అభివృద్ధికి ఏ ప్రభుత్వాలు కృషి చేయలేదనే చెప్పాలి.
భారతదేశ ఏవియేషన్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఒక సరికొత్త అధ్యాయానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. భారతదేశపు మొట్టమొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్.. (AAD) ఎడ్యుకేషన్ సిటీని భోగాపురంలో ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం ఒక విద్యా కేంద్రం కాదు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు తరానికి అపారమైన అవకాశాలకు ముఖద్వారం కూడా. జీఎంఆర్ వంటి అంతర్జాతీయ సంస్థ ప్రపంచ స్థాయి నైపుణ్యం, విజయనగరం రాజుల వారసత్వ సంస్థ మాన్సస్.. MANSAS (మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్) భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు సరికొత్త దిశానిర్దేశం చేస్తోంది.
Also Read : బ్రేకింగ్: అనర్హతపై స్పీకర్ సంచలన తీర్పు..!
భారత ఏవియేషన్ రంగం అంచెలంచెలుగా ఎదుగుతోంది. రాబోయే దశాబ్దాల్లో ఈ వృద్ధిని నిలబెట్టాలంటే, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం అనివార్యం. 2035 నాటికి దేశంలో విమానాల సంఖ్య మూడు రెట్లు కానుంది. ఈ భారీ డిమాండ్‌ను తీర్చడానికి, 10 లక్షల మందికి పైగా నిపుణుల అవసరం ఉంది. ఈ జాబితాలో పైలట్‌ల నుండి అత్యాధునిక సాంకేతిక నిపుణులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ల వరకు లక్షలాది మంది నిపుణులు ఉన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం 2034 నాటికి ఏకంగా 57 బిలియన్ డాలర్ల మార్కెట్ స్థాయిలో వృద్ధి చెందనుంది. ఈ అపారమైన మార్కెట్‌లో భారత యువత ప్రపంచ స్థాయిలో పోటీపడాలంటే, భోగాపురం ఎడ్యుసిటీయే వారికి అత్యుత్తమ పరిష్కారం.
ప్రస్తుతం ఏటా గ్రాడ్యుయేట్ అవుతున్న ఇంజనీర్లలో కేవలం 0.5 శాతం మంది మాత్రమే ఏరోస్పేస్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. భారత్‌లో సరైన శిక్షణా సంస్థలు లేకపోవడమే. ఈ భారీ నైపుణ్య లోటును పూరించడానికి MANSAS – GMR ఎడ్యుసిటీ ఒక “నేషనల్ కేపబిలిటీ ప్లాట్‌ఫారమ్” గా నిలవనుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువలో, 160 ఎకరాల్లో విస్తరించి, భవిష్యత్తులో 500 ఎకరాల వరకు విస్తరించే అవకాశం ఉన్న ఈ సిటీలో ఎన్నో ప్రధాన ఆకర్షణలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు తమ బ్రాంచ్ క్యాంపస్‌లను ఇక్కడ స్థాపించి, ప్రపంచ స్థాయి విద్యను అందించనున్నాయి. ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ (AI), సుస్థిర ఏవియేషన్ వంటి భవిష్యత్తు టెక్నాలజీలపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. GMR వంటి దిగ్గజ సంస్థల నైపుణ్యంతో, విద్యార్థులకు ఆపరేషనల్ MRO (Maintenance, Repair and Overhaul) కేంద్రాల్లోనే ప్రాక్టికల్ శిక్షణ లభిస్తుంది. అధునాతన పరిశోధనా కేంద్రాలు, ఇంక్యుబేషన్ సౌకర్యాలు, స్టార్టప్‌లతో పరిశ్రమ, విద్యారంగం మధ్య బలమైన అనుసంధానం ఏర్పడుతుంది.
Also Read : జగన్‌కు ఉహించని షాక్ ఇచ్చిన బాబు సర్కార్
ఈ ప్రాజెక్ట్ కేవలం కొన్ని ఉద్యోగాలు సృష్టించడం మాత్రమే కాదు. ఇది రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులను తీసుకురావడం ద్వారా, ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్, ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ పటంలో నిలపడం లక్ష్యంగా పెట్టుకుంది. MANSAS GMR ఏవియేషన్ & ఏరోస్పేస్ ఎడ్యుసిటీ, భారత యువతకు ఆకాశమే హద్దు అని నిరూపిస్తూ, మన దేశ, రాష్ట్ర లక్ష్యాలను ముందుకు నడుపుతుంది. ఉత్తరాంధ్ర భూమిపై ఇంతటి ప్రతిష్టాత్మక విద్యా కేంద్రం రావడం, ఈ ప్రాంత ఉజ్వల భవిష్యత్తుకు భరోసానిస్తుంది.

