ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ఆపడమే తన లక్ష్యమని చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేసారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే దిశగా ట్రంప్ కీలక అడుగులు వేసారు. ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామని వెల్లడించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దానికి సంపూర్ణ పరిష్కారం చూపేందుకు ఇరాన్ తో చర్చలు జరిపినట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్ తో జరిగిన చర్చలు అత్యంత ప్రయోజనకరంగా, నిర్మాణాత్మకంగా సాగాయని ట్రంప్ ప్రకటించారు.
Also Read : శ్రీశైలం డ్యామ్ పునాదులు కదులుతున్నాయా..? రంగంలోకి దిగిన కేంద్రం..!
శత్రుత్వానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య సంభాషణలు మొదలయ్యాయన్నారు ట్రంప్. చర్చలు విజయవంతం అయ్యేందుకు వీలుగా, ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై అమెరికా చేపట్టాల్సిన దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ట్రంప్ తన రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు నాలుగు వారాలుగా సాగుతున్న ఈ యుద్ధం తన లక్ష్యాలను చేరుకుందని, అందుకే సైనిక కార్యకలాపాలను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Also Read : కుప్పకూలిన బంగారం ధరలు.. కొనేవారికి పండగే..!
అయితే, చర్చలు సఫలం కావాలంటే ఇరాన్ వెంటనే హొర్ముజ్ జలసంధిని ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరిచి ఉంచాలని ట్రంప్ కోరారు. యుద్దానికి మళ్ళీ ఇరాన్ కాలు దువ్వితే 5 రోజులకు ముందే మేము దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న పవర్ ప్లాంట్ లు సహా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపధ్యంలోనే ట్రంప్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కోలుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఇరాన్ ఈ శాంతి ఒప్పందానికి ఏ మేరకు అంగీకరిస్తుందనేది రాబోయే 5 రోజుల్లో తేలనుంది.

