తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ అలర్ట్ పంపింది. విజయవాడ – దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు యార్డ్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఏప్రిల్ 28 నుంచి మే 5 మధ్య విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కాకినాడ మార్గాల్లో ప్రయాణించే వారు తమ రైలు స్టేటస్‌ను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించింది. ప్రధానంగా విజయవాడ – సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే 20 రైళ్లను 8 రోజుల పాటు రద్దు చేసింది. అలాగే సుమారు 10 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్గంలో ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు రైల్వే శాఖ అధికారులు.
Also Read : బ్రేకింగ్: డిజిటల్ పేమెంట్స్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం..!
విజయవాడ శివారులోని రాయనపాడు రైల్వే స్టేషన్‌ను శాటిలైట్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేస్తోంది రైల్వే శాఖ. ఇప్పటికే కాకినాడ – సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లు విజయవాడ రైల్వే స్టేషన్‌ను బైపాస్ చేస్తూ రాయనపాడు మీదుగా నేరుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక విజయవాడ – సికింద్రాబాద్ నిత్యం వేల మంది ప్రయాణిస్తుంటారు. ఇందుకు తగినట్లుగా రైల్వే శాఖ రైళ్లు నడిపిస్తోంది. విజయవాడ – సికింద్రాబాద్ వయా కాజీపేట మీదుగా సుమారు 6 గంటలు ప్రయాణ సమయం పడుతుంది. ఇదే మార్గంలో వందేభారత్ రైలులో 4 గంటలే అవుతుంది. ఇక చెన్నై – నాగపూర్ మధ్య మూడో ట్రాక్ నిర్మాణ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ ట్రాక్ పనులతో పాటు ఈ మార్గంలో ఉన్న స్టేషన్‌ల ఇంటర్ లింకింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.
తాజాగా రాయనపాడు యార్డ్ పనుల కారణంగా 8 రోజుల పాటు విజయవాడ నుంచి కాజీపేట మీదుగా సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేసింది. విశాఖపట్నం – ఎల్‌టీటీ – విశాఖపట్నం, ముంబై – భువనేశ్వర్, మచిలీపట్నం – షిరిడీ, షాలిమార్ – చర్లపల్లి – షాలిమార్, ఆదిలాబాద్ – తిరుపతి – ఆదిలాబాద్, నరసాపూర్ – నాగర్ సోల్ రైళ్లను కాజీపేట మార్గంలో రద్దు చేశారు. ఈ రైళ్లు కృష్ణాకెనాల్, గుంటూరు, పగిడిపల్లి మీదుగా ప్రయాణిస్తాయి. విశాఖపట్నం – హజరత్ నిజాముద్దీన్ సూపర్ ఫాస్ట్ రైలు మాత్రం.. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, వరంగల్, బల్హార్ష మార్గం బదులుగా విశాఖ నుంచి నేరుగా దుర్గ్ మీదుగా నాగ్‌పూర్ చేరుతుంది.
Also Read : కేబినెట్ సమాచారం లీక్.. మంత్రులపై చంద్రబాబు డౌట్
ఇక విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు గోల్కోండ ఎక్స్‌ప్రెస్, విశాఖ – మహబూబ్‌నగర్ – విశాఖ, కాకినాడ పోర్ట్ – లింగంపల్లి – కాకినాడ పోర్ట్ గౌతమీ ఎక్స్‌ప్రెస్, సంబల్‌పూర్ – నాందేడ్ – సంబల్‌పూర్, విశాఖ – నాందేడ్ – విశాఖ, కాకినాడ టౌన్ – లింగంపల్లి – కాకినాడ టౌన్, విజయవాడ – డోర్నకల్ – విజయవాడ మెము, విజయవాడ – భద్రాచలం రోడ్ – విజయవాడ మెము రైళ్లను ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణీకులు తమ ప్రయాణానికి ముందు రైలు స్థితిని తనిఖీ చేసుకోవాలని రైల్వే శాఖ స్పష్టమైన సూచన చేసింది.

