మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో.. నియోజకవర్గ కేంద్ర మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 32 వార్డులకు గానూ, కీలకమైన మున్సిపల్ చైర్మన్ పీఠంతో పాటు కనీసం 12 వార్డు స్థానాలను తమకే కేటాయించాలని జనసేన పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. అయితే, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రం జనసేన పెడుతున్న ఈ డిమాండ్లకు ఏమాత్రం అంగీకరించడం లేదు.
Also Read : SBI ఖాతాదారుల డేటా లీక్ కలకలం.. అసలేం జరిగింది..?
ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని వీడి జనసేనలో చేరిన వలస నేతలను, పాత వైసీపీ క్యాడర్ను జనసేన తరఫున ఎన్నికల బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు మరింత భగ్గుమన్నాయి. మరోవైపు, ఈ సీట్ల పంపకాల పంచాయితీ స్థానిక టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. గతంలో వరుసగా నాలుగు సార్లు ఓడిపోయిన సాలూరు నియోజకవర్గంలో, నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రింబవళ్లు కష్టపడి కూటమిని గెలిపించుకున్నామని టీడీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.
Also Read : సుప్రీం తీర్పు పై వైసీపీ ఫేక్ ప్రచారం..!
ఇంతకాలం పార్టీ కోసం రక్తం చెమటోడ్చిన తమను కాదని, వేరే పార్టీ నుంచి నిన్న కాక మొన్న వచ్చిన వారికి, అలాగే జనసేన నేతలకు ఎక్కువ సీట్లు ఎలా ఇస్తారని, తమకు అన్యాయం చేయవద్దని టీడీపీ క్యాడర్ స్థానిక నాయకత్వాన్ని నిలదీస్తోంది. ఈ అంతర్గత పోరు కాస్తా ముదిరి పాకాన పడటంతో మున్సిపాలిటీలో రెబల్స్ రూపంలో కూటమికి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో, సాలూరు మున్సిపాలిటీలో పొత్తులు పక్కన పెట్టి ఒంటరిగానైనా పోటీ చేసేందుకు తాము సిద్ధమంటూ అటు టీడీపీ, ఇటు జనసేన స్థానిక నాయకులు ఇరుపక్షాలూ తెగేసి చెప్తున్నాయి.


