ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బలోపేతం కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. తెలంగాణలో రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్ లో మాధవ్ లను రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక చేసింది. 2014 నుంచి 2019 వరకు జరిగిన తప్పులను మరోసారి జరగకుండా ఉండేందుకు బిజెపి జాగ్రత్తలు పడింది. సోమ వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న సమస్యలను మరోసారి ఎదుర్కోకుండా ఉండేందుకు ఎన్డీఏ పార్టీల అభిప్రాయాలను తీసుకుంది.
Also Read : బాబుతో సమావేశానికి డుమ్మా కొట్టిన నాయకులు వీరే..?
అందుకే సౌమ్యుడిగా పేరున్న మాధవ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి అభిప్రాయాన్ని కూడా తీసుకున్న బిజెపి అగ్రనాయకత్వం.. మాధవ్ ను ఎంపిక చేసింది. అనర్గళంగా మాట్లాడటమే కాదు, పార్టీ సిద్ధాంతాల విషయంలో స్పష్టమైన అవగాహన కలిగిన నాయకుడు కావడంతో ఆయనను ఎంపిక చేసింది. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన మాధవ్ ఆ తర్వాత పార్టీ కోసం తీవ్రంగానే కష్టపడ్డారు. 2017 ఎన్నికల్లో కూటమి నుంచి ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
Also Read : మహా న్యూస్ పై దాడి వెనుక వైసీపీ హస్తం..?
ఆ సమయంలో మంచి మెజారిటీతో ఎమ్మెల్సీగా ఎన్నికైన మాధవ్.. 2023 లో మాత్రం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. తన తండ్రి నుంచి బిజెపితో అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్న మాధవ్.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో విజయవంతం అవుతారని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అన్ని పార్టీల నాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. 2024 తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని చాలామంది భావించారు. కానీ పలు కారణాలతో ఆ పదవి వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతో త్వరలోనే ఆయనను ఎమ్మెల్సీగా మండలికి మరోసారి పంపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన తండ్రి హనుమంతరావు సైతం రెండుసార్లు శాసనమండలికి ఎంపికయ్యారు.