మంచి చేయం.. చేసే వాడిని చేయనివ్వం.. అనే మాట నిజమని మరోసారి రుజువైంది. మానవ నైజం ఎలా ఉంటుందంటే.. కుక్క తోక వంకర అన్నట్లుగానే ఉంటుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడే వేయటం.. మళ్లీ అపరిశుభ్రం అని కబుర్లు చెప్పడం.. నీటిలో చెత్త పారేయడం.. మళ్లీ.. కనీసం మంచినీళ్లు కూడా దొరకటం లేదని గట్టిగా మాట్లాడటం.. ఇదే మనిషి నిజస్వరూపం.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఓ 20 ఏళ్ల యువకుడి 8 నెలల కష్టం. నానా పాట్లు పడి శుభ్రం చేస్తే.. సరిగ్గా వారం రోజుల్లోనే దానిని పాడు చేసి పక్కన పడేశారు. ఇలా ఉంటుంది మనుషుల మనస్తత్వం.
ALso Read : కేసుల ఉచ్చు బిగుస్తోందా? ఒత్తిడితో జగన్ ఉక్కిరిబిక్కిరి..!
మధ్యప్రదేశ్లోని అజ్నార్ నదిని ఇటీవల ‘బిట్టూ తబాహి’ అనే ఓ 20 ఏళ్ల యువకుడు శుభ్రం చేశాడు. ఎనిమిది నెలల పాటు తీవ్రంగా శ్రమించాడు. టన్నుల కొద్దీ చెత్తను అతడు తొలగించాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. బిట్టూకు ఈత రాదు.. ప్రత్యేక పరికరాలు లేవు. అయినా సరే.. ఎంతో కష్టపడి మరీ నదిని శుభ్రం చేశాడు. అయితే బిట్టూ ఇంత కష్టపడి చేసిన పని అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది. ఒక వ్యక్తి మన భవిష్యత్తు అవసరాల కోసం శ్రమించి శుభ్రం చేశాడనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. వారం రోజుల వ్యవధిలోనే నదిలో చెత్త వేసేశారు. ప్లాస్టిక్ సంచులు విసిరేశారు. దీంతో తన కష్టమంతా వృధా అయ్యిందంటూ బిట్టూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
“నా ఎనిమిది నెలల కఠోర శ్రమ ఇలా వృథా అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. నాకు ఈత రాకపోయినా ప్రత్యేక పరికరాలు లేకపోయినా ఎంతో కష్టపడి నదిని శుభ్రం చేశాను. అయినా ప్రజలు మళ్లీ చెత్తాచెదారంతో కలుషితం చేశారు. కానీ నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు మళ్లీ నదిని శుభ్రం చేస్తాను ఈ పనిని త్వరగా పూర్తి చేయాలంటే ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి” అని బిట్టూ నెటిజన్లను కోరాడు. అజ్నార్ నదిలోని ప్లాస్టిక్ సంచులను బయటకు తీస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బిట్టూ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిట్టూ వీడియోను పలువురు నెటిజెన్లు షేర్ చేస్తూ.. మద్దతు ఇస్తున్నారు.
Also Read : జనసేన పోటీ సీట్లపై పవన్ లెక్క తేలిందా..?
బిట్టూ పట్టుదలను, నిబద్ధతను నెటిజన్లు అభినందిస్తున్నారు. నదుల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్లోని రాజ్ గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన సురేంద్ర సింగ్ చౌధరీ.. అలియాస్ బిట్టూ తబాహి డిగ్రీ చదువుతున్నాడు. స్థానికంగా ప్రవహించే అజ్నార్ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో డంపింగ్ యార్డుగా మారడాన్ని చూసి ఎలాగైనా శుభ్రం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈత రాకున్నా, గౌజ్లు, బూట్లు లేకపోయినా.. కొందరు స్నేహితుల సహాయంతో 8 నెలల పాటు నదిలోని వ్యర్థాలు తొలగించి వార్తల్లో నిలిచాడు. భక్తి పేరుతో కొందరు నదిలోకి పూలు, వత్తులు వేస్తుంటే.. ఆ పక్కనే కొందరు చెత్తాచెదారం వేస్తున్నారు. ఇవన్నీ బిట్టూ రికార్డ్ చేసిన వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. నదులు అపరిశుభ్రంగా ఉన్నాయనేది జనమే.. నదులను కలుషితం చేసేది కూడా అదే జనం.. ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి ఆపాదించి.. ఆరోపించడం కంటే.. ముందు జనంలో మార్పు రావాలి.. చెత్తను ఎక్కడ బడితే అక్కడ వేయటం, నీటిని కలుషితం చేయడం మానుకోవాలి. అప్పుడే స్వచ్ఛ భారత్, నమామి గంగే వంటి ప్రాజెక్టులకు ఓ అర్థం ఉంటుంది.


