ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక కేసుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ, తిరుమలకు సరఫరా చేసిన నెయ్యి కల్తీ వ్యవహారంలో ఆస్తుల అటాచ్మెంట్, మద్యం కుంభకోణం కేసులో మాజీ అధికారికి సమన్లు.. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ అంశాలు వైసీపీకి రాజకీయంగా ఒత్తిడి పెంచుతున్నాయి. ఒకేసారి ఇన్ని కేసులు తెరపైకి రావడం.. విచారణ ప్రక్రియ వేగవంతంతో వైసీపీ నాయకత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఈడీ ముందుకు అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అక్టోబర్ 14న ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నించారు. హత్య కేసుతో ముడిపడినట్లు ఆరోపణలు ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈ దర్యాప్తు సాగుతోంది. అవినాష్‌రెడ్డిని అక్టోబర్ 15న మరోసారి విచారణకు రావాలని అధికారులు ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తదుపరి విచారణలో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయన్న ఆసక్తి నెలకొంది.
Also Read : అర్ధరాత్రి ట్వీట్ చేసిన జగన్.. క్యాడర్ కు లీకులు ఇస్తున్నట్టా..?
నెయ్యి కల్తీ కేసులో రూ.129.85 కోట్ల ఆస్తుల అటాచ్మెంట్
తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసిన నెయ్యి కల్తీకి సంబంధించిన కేసులో ఈడీ కీలక చర్య తీసుకుంది. డెయిరీ సంస్థలు, వాటి ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తులు, సంస్థలకు చెందిన రూ.129.85 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యికి సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసుపై భక్తుల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఆస్తుల అటాచ్మెంట్ దర్యాప్తులో భాగమైన చర్య మాత్రమే. దానిని నిందితులపై నేరం రుజువైనట్లుగా భావించలేం. అయితే ఈ కేసులో ఉన్న పెద్దల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తుంది.
మద్యం కేసులో రజత్ భార్గవకు సమన్లు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. గతంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయనను విచారణకు పిలవడం ఈ కేసులో తాజా పరిణామం. మరోవైపు, ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై విచారణకు సంబంధించిన న్యాయ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
Also Read : వంశీపై యార్లగడ్డ సంచలన కామెంట్స్..!
రాజకీయ చర్చకు కేంద్రంగా కేసులు
వేర్వేరు కేసుల్లో విచారణలు, సమన్లు, ఆస్తుల అటాచ్మెంట్ వంటి పరిణామాలు ఒకే సమయంలో చోటుచేసుకోవడంతో వీటి రాజకీయ ప్రభావం పైనా చర్చ మొదలైంది. వైసీపీ నాయకులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులకు సంబంధించిన కేసులు కావడంతో పార్టీ వీటికి ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది.
అయితే ఈ కేసులన్నీ ఒక్కొక్కటిగా విచారణకు వస్తుండటం, పైగా ఈ కేసుల్లో అంతిమ లబ్దిదారుడు జగన్ అనే విధంగా సంకేతాలు వస్తుండటంతో వైసీపీలో తీవ్ర అలజడి మొదలైంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దూకుడు మీద ఉన్న అధికార పక్షానికి ఈ కేసులు కూడా తోడైతే జగన్ ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరి వీటిని జగన్ ఎలా ఎదుర్కొంటాడు అని విషయంలో తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


