తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం దిశగా అడుగులు పడుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత కుంపటి పెట్టేందుకు రంగం సిద్దమైంది. తన సామాజిక సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తూ, తెలంగాణ ప్రజా జాగృతి.. అనే పేరును ఆమె ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు కవిత.
Also Read : ఏపీకి పండగొచ్చింది.. బాబు సర్కార్ ఉగాది వరాలు
ఇప్పుడు అదే పునాదిపై రాజకీయ సౌధాన్ని నిర్మించబోతున్నారు. గత కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న కవిత.. ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సొంతంగా జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈ ఏడాది జనవరి 23నే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ప్రక్రియలో జాప్యం జరగడంతో ఆమె న్యాయపోరాటానికి దిగారు. తన దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : జగన్ ఉంటే చాలు శత్రువులు అవసరం లేదు..!
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కవిత సమర్పించిన తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరు, రిజిస్ట్రేషన్ దరఖాస్తుపై వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామంతో కవిత కొత్త పార్టీకి లైన్ క్లియర్ అయినట్లేనని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈసీ కొన్ని సాంకేతిక అంశాలపై వివరణ కోరింది. ఫిబ్రవరి 23నే కవితకు నోటీసులు పంపినట్లు ఈసీ కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కవిత బృందం, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించామని, పార్టీ పేరు విషయంలో ఎటువంటి వివాదం లేదని ధీమా వ్యక్తం చేస్తోంది.

