వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన రాజకీయ పునాది ఉన్న ప్రాంతంగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డగా పేరుగాంచిన వైఎస్సార్ కడప జిల్లాలోనే వైసీపీకి కోలుకోలేని ఘోర పరాభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఏకంగా ఏడు మున్సిపాలిటీల్లో వైసీపీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా బరిలో నిలిచి పార్టీ ఉనికిని చాటాలని, లేదంటే భవిష్యత్తులో అసెంబ్లీ టికెట్ల విషయంలో ఇబ్బందులు వస్తాయని గతంలో తాడేపల్లి సమీక్షల్లో జగన్ హెచ్చరించినప్పటికీ, సొంత జిల్లాలోనే అభ్యర్థులు నామినేషన్ల దశలోనే పూర్తిగా వెనకడుగు వేయడం గమనార్హం.
Also Read : బెజవాడలో దూకుడు పెంచిన ఏబీవీ..!
ఈ అనూహ్య పరిణామంపై వైసీపీ ముఖ్య నేతలు స్పందిస్తూ… అధికార కూటమి నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, దాడులు చేస్తూ పోలీసుల సాయంతో తమ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై కూటమి నేతలు మరియు ప్రత్యర్థులు గట్టిగానే ఎదురుదాడి చేస్తున్నారు. మిగిలిన ప్రతిపక్ష పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నామినేషన్లు దాఖలు చేసినప్పుడు, కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే ఎందుకు వేయలేకపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాల పేరుతో ప్రతిపక్షాలను ఎంతలా ఒత్తిడికి గురిచేశారో గుర్తు చేస్తూ, ఇప్పుడు ఓటమి భయంతోనే సాకులు వెతుకుతున్నారని విమర్శిస్తున్నారు.
Also Read : కిమ్ జోంగ్ ఉన్ మృతి నిజమేనా..?అసలేం జరిగింది..?
రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఈ పరిస్థితికి బాహ్య ఒత్తిళ్లతో పాటు పార్టీ అంతర్గత వ్యవస్థ లోపాలు, తీవ్ర సమన్వయ లోపమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ నుంచి ఎలాంటి ప్రత్యేక ఆర్థిక సహాయం ఉండదని, నాయకులు తమ సొంత బలంతోనే పోరాడాలని జగన్ ముందే స్పష్టం చేయడంతో చాలామంది వెనక్కి తగ్గారు. దీనికి తోడు, అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులూ అనుభవించిన నియోజకవర్గ ఇన్చార్జ్ లు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించడం లేదని, కార్యకర్తలకు న్యాయపరమైన, రాజకీయ భరోసా కల్పించడంలో విఫలమయ్యారని తెలుస్తోంది. పుంగనూరు వంటి మున్సిపాలిటీల్లో కూడా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యూహాల దెబ్బకు వైసీపీ పూర్తిగా ఖేల్ ఖతం అయిందని, జగన్ తక్షణమే క్షేత్రస్థాయిలోకి వచ్చి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపకపోతే రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత బలం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


