ప్రపంచాన్ని ఎప్పుడూ తన అణు పరీక్షలు, హెచ్చరికలతో ఉత్కంఠలో ఉంచే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రాణాల మీద సోషల్ మీడియాలో మరోసారి సంచలన వదంతులు గుప్పుమన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్తో మరణించారంటూ చైనా డెమోక్రసీ పార్టీ చైర్మన్ వాంజున్ క్సీ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపాయి. కిమ్ మరణం తర్వాత ఆయన కుమార్తె కిమ్ జు-ఏ చేతికి కాకుండా, ఆయన సోదరి కిమ్ యో జోంగ్ చేతికి దేశ పగ్గాలు దక్కాయని ఆరోపించారు.
Also Read : జైలర్ 2 కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజూ శాంసన్..!
వాంజున్ క్సీ తన పోస్టులో కిమ్ హఠాత్తుగా కోమాలోకి వెళ్లడంతో చైనాలోని పీకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం వెళ్లిందని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం కిమ్ ను బీజింగ్ తరలించినా ఫలితం లేకపోయిందని, ఆయన మృతదేహాన్ని రహస్యంగా ఉత్తర కొరియాకు చేర్చారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఉత్తర కొరియాలో వారసత్వ పోరును అణచివేయడానికి చైనా దాదాపు 9,000 మంది సైనికులను ప్యాంగ్యాంగ్కు పంపిందంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. దీనితో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆరోగ్యంపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన లోకేష్..!
ఈ వింత ప్రచారాలు, నిరూపితం కాని కథనాలకు అంతర్జాతీయ వర్గాలు ఊహాగానాలుగా కొట్టిపారేయగా, ఉత్తర కొరియా అధికారిక మీడియా వీటికి గట్టి సమాధానం ఇస్తూ తెరదించింది. ప్యాంగ్యాంగ్లో జరిగిన ఒక అధికారిక ఎక్స్పో కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కుమార్తె కిమ్ జు-ఏ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిని, ప్రదర్శనలోని స్టాళ్లను కిమ్ స్వయంగా పరిశీలిస్తున్న తాజా ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. కిమ్ పూర్తి ఆరోగ్యంతో బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు బయటకు రావడంతో, ఆయన మృతి చెందారంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది.


