వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంట్లో నలుసుగా మారారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఒకప్పుడు జగన్ వెంటే ఉన్న సాయిరెడ్డి.. ఇప్పుడు మాత్రం కొరకరాని కొయ్యగా మారారు. జగన్ ఓడిన తర్వాత ముందు వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇక శేష జీవితం వ్యవసాయమే అని కూడా గొప్పగా చెప్పారు. కానీ.. సరిగ్గా రెండు నెలలకే మాట మార్చారు. రాజకీయాల గురించి విమర్శలు, వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ముందు ఓ న్యూస్ ఛానల్ మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తానే సొంతంగా ఓ రాజకీయ పార్టీ మొదలుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించి సంచలనం రేపారు.
Also Read : కిమ్ జోంగ్ ఉన్ మృతి నిజమేనా..?అసలేం జరిగింది..?
నిజానికి ఎప్పుడో ఆగస్టు నెలలోనే పార్టీ పేరు ప్రకటిస్తా అని సాయిరెడ్డి వెల్లడించారు. అయితే.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పటికే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి.. రాజకీయ విమర్శలు చేశారు. అదే సమయంలో తనదే నిజమైన రెడ్డి పార్టీ అని కూడా ప్రకటించారు. అంతటితో ఊరుకోలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజమైన రెడ్డి కాదని.. వాళ్లు క్రైస్తవులంటూ ప్రకటించారు. నిజమైన రెడ్లు తన వెంటే ఉన్నారన్నారు. అలాగే వైసీపీలో నుంచి తనతో నడిచేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని కూడా ప్రకటించారు. అలాగే తాను అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థిగా కొత్త వ్యక్తి ఉంటారని కూడా ప్రకటించారు.
ముందు దసరా రోజున తన పార్టీ ప్రకటిస్తా అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ మార్చేశారు. పార్టీ ప్రకటన తేదీ, సమయాన్ని సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఇప్పుడు ఇదే పెద్ద దుమారం రేపుతోంది. నవంబర్ 11న పార్టీ ఆవిర్భావం అంటూ ప్రకటించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. “11వ నెల, 11వ తేదీన, 11 గంటల 11 నిమిషాలకు.. మనందరి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం” అంటూ సాయిరెడ్డి ప్రకటించారు. దీనితో పాటు పార్టీ మ్యానిఫెస్టో కూడా ప్రకటించారు. అయితే జనమంతా మ్యానిఫెస్టో కంటే.. ప్రకటన తేదీ, సమయం పైనే చర్చించుకుంటున్నారు. కొందరైతే సైటెర్లు కూడా వేస్తున్నారు.
Also Read : జైలర్ 2 కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజూ శాంసన్..!
2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అందుకే ఇప్పుడు సాయిరెడ్డి ఆ సంఖ్య వచ్చేలా తేదీ, సమయంపైన ప్రకటన చేశారంటున్నారు. ఇప్పటికే కడప జిల్లాతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన బాధతో ఉన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని మరింత ఏడిపించడానికే కదా.. ఇలా అంకెలతో సహా ప్రకటన చేశారని సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే.. “పాపం సాయిరెడ్డి గారు.. చచ్చిన పామును ఇంకా చంపకండి.. వదిలేయండి ప్లీజ్..” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా.. సాయిరెడ్డి దెబ్బకు వైసీపీ నేతల దిమ్మ తిరిగినట్లు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


