ఏపీలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే మూడు నెలలు దాటి పోయింది. తొలి రోజుల్లోనే బోర్డు ఏర్పాటవుతుందని అంతా ఆశపడ్డారు. అయితే సామాజిక సమీకరణల లెక్కల పేరుతో ఇన్ని రోజులు వాయిదా పెడుతూ వచ్చారు చంద్రబాబు. ఇప్పటికే 20 కార్పొరేషన్‌లకు ఛైర్మన్లను ప్రకటించడంతో… ఏ నిమిషంలో అయినా సరే టీటీడీ బోర్డు ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకుంది.
ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలను స్వార్థానికి వాడుకున్నారని… ఎన్నో అక్రమాలకు టీటీడీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి తోడు తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు ఎంపికలో చంద్రబాబు భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏ నిమిషంలో అయినా బోర్డు ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు పార్టీ నేతలు. జాబితా ఇప్పటికే జీఏడీ నుంచి సీఎంఓకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also : అసలు పులివెందులలో ఏం జరుగుతోంది…?
బోర్డు ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు పేరును దాదాపు ఖరారు. ఇక బోర్డు సభ్యులుగా టీడీపీ తరపున ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ తరఫున కామినేని శ్రీనివాస్ లేదా విష్ణుకుమార్ రాజు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక జనసేన తరఫున గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్‌ను పవన్ కల్యాణ్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక పార్టీ తరఫున జాతీయ అధికార ప్రతినిధి ప్రొ.తిరునగరి జ్యోత్స్నను ఖరారు చేశారు. కార్పొరేట్ కోటాలో భారత్ బయోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీనివాసులు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరితో పాటు మహారాష్ట్ర నుంచి ఒకరిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. బోర్డు ప్రకటన వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. దసరా బ్రహ్మోత్సవాల్లోనే బోర్డు ప్రకటన, తొలి సమావేశం కూడా నిర్వహించాలనేది కూటమి ప్రభుత్వం ప్లాన్.




