రథసప్తమి అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పుణ్యక్షేత్రం అరసవల్లి. శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువైన దివ్య క్షేత్రం. ప్రత్యక్ష నారాయణుని పండుగ సందర్భంగా రథసప్తమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రెండేళ్లుగా అరసవల్లిలో రథసప్తమి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి.. భారీగా నిధులు విడుదల చేసింది కూడా. అయితే రథసప్తమి పండుగ నాడు కొందరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. అరసవల్లిలో వీవీఐపీల కోసం ప్రత్యేక పాస్‌లను ముద్రించారు. ఇప్పుడు అవి నకిలీ అని తేలడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : బరితెగింపు వెనుక జగన్ ఆశీస్సులు..!
ఈ ఏడాది అరసవల్లిలో నిర్వహించిన రథసప్తమి వేడుకల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ఏకంగా రూ.10 కోట్లు ఆదాయం రాగా.. ఈ ఏడాది కనీసం రూ.కోటి మార్క్ కూడా దాటలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భానుడి దర్శనానికి వచ్చిన వారు తీసుకువచ్చినవి నకిలీ పాసులని తేలడంతో అసలు దొంగలెవరా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రథసప్తమి నేపథ్యంలో నకిలీ పాసులు ప్రింట్ చేసిన వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇందులో మరికొన్ని పేర్లు తెరపైకి రావడంతో వారిమీద కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు ఈ కేసును ముందుకు కదలనివ్వడం లేదని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యవహారం ముగింపు దిశగా సాగుతోందట.
సూర్యజయంతి సందర్భంగా ఆదిత్యుని దర్శనం కోసం ప్రభుత్వం కొన్ని పాసులను ప్రింట్ చేయించింది. శ్రీకాకుళం పట్టణంలోని మణికంఠ జిరాక్స్‌లో దానికి నకిలీలను సృష్టించారు కొందరు ప్రబుద్ధులు. ఈ వ్యవహారంలో మణికంఠ జిరాక్స్ నిర్వాహకులను సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ల పాత్రపైనా ఆరోపణలు రావడం, అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా దొరకడంతో వారిని పిలిచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. మణికంఠ జిరాక్స్ నిర్వాహకుల కాల్ డేటా ఆధారంగా చాలామందిని పిలిచి పోలీసులు విచారించారు. తామే పాస్‌లను ప్రింట్ చేశామని మొదట మణికంఠ జిరాక్స్ నిర్వాహకులు పోలీసుల వద్ద అంగీకరించారు. అయితే ఇక్కడితో కథ ఆగిపోలేదు. ఇందులో మరికొందరు సూత్రధారుల పేర్లు నాటకీయ పరిణామాల మధ్య వెలుగులోకి వచ్చాయి.
Also Read : వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. క్యాడర్ కి బాబు దిశానిర్దేశం
మణికంఠ జిరాక్స్ నిర్వాహకుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సప్ డేటాను బ్యాకప్ పెట్టగా కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ఓ సాయంకాల పత్రిక ఎడిటర్ కొన్ని వీవీఐపీ పాస్‌లను మణికంఠ జిరాక్స్ నిర్వాహకులకు వాట్సప్ ద్వారా పంపి వాటిని ప్రింట్ చేయాలని సూచించినట్టు తెలిసింది. దాని ఆధారంగా భారీ సంఖ్యలో వీవీఐపీ పాస్‌లను మణికంఠ జిరాక్స్ నిర్వాహకులు ప్రింట్ చేశారు. బ్యాకప్ పెట్టిన వాట్సప్ డేటా ద్వారా ఈ ఛాటింగ్ మొత్తం పోలీసులకు లభించింది. దీంతో విషయాన్ని జిల్లా పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. దాని ఆధారంగా సూత్రధారిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ వేయాలని మొదట భావించారు. అయితే జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నాయకుడు విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని జిల్లా పోలీస్ బాస్‌కు విజయవాడ నుంచి ఫోన్‌లోనే ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ఎన్ని పాస్‌లు ప్రింట్ చేశారు, వాటిని ఎవరెవరికి ఇచ్చారు.. వంటి వివరాలు అరసవల్లి ఆలయ ఈఓ నుంచి సేకరించి కేసు క్లోజ్ చేయాలని కీలక నాయకుడి నుంచి పోలీసులకు ఒత్తిడి వస్తోందట. దీంతో ఏం చేయాలో అర్ధం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మణికంఠ జిరాక్స్ నిర్వాహకులను సీసీఎస్ నుంచి లా అండ్ ఆర్డర్‌కు తరలించారు. సీసీఎస్‌లో కేసు నమోదు చేయడం కుదరదు కాబట్టి మణికంఠ జిరాక్స్ ఉన్న టూ టౌన్ పరిధిలో దీనిపై ఎఫ్ఐఆర్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందులో ఇన్‌ఫ్లూయన్సర్ల పాత్ర కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజమండ్రిలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో వేల సంఖ్యలో నకిలీ పాస్‌లను ప్రింట్ చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ నాయకులకు చెందిన సమీప బంధువుని సమాచారం. మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఉండడంతో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి. జిల్లా పోలీస్ బాస్ మాత్రం ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా మొత్తం డొంకను లాగేసి అందరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

