నటీనటులు: రణ్వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, రాకేష్ బేడీ తదితరులు
సంగీతం: శశ్వత్ సచ్ దేవ్
ఛాయాగ్రహణం: వికాస్ నౌలాఖా
నిర్మాతలు: ఆదిత్య ధర్, లోకేష్ ధర్, జ్యోతి దేశ్ పాండే
రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్
గత ఏడాది డిసెంబర్ 5న పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన ‘దురంధర్’ చిత్రం సుమారు రూ.1400 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కించగా, మొదటి భాగం విజయంతో పెరిగిన అంచనాల నడుమ కేవలం మూడు నెలల వ్యవధిలోనే ‘దురంధర్: ది రివెంజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీక్వెల్ మొదటి భాగం స్థాయిని అందుకుందా? కథను దర్శకుడు ఎలా కొనసాగించాడు? అనే అంశాలను పరిశీలిద్దాం.
ఈ కథలో ఇండియన్ ఏజెంట్ జస్కీరత్ సింగ్ రంగి, హంజా అలీ అనే పేరుతో పాకిస్థాన్‌లో స్థిరపడతాడు. అక్కడి కీలకమైన ల్యారీ సిటీపై తన ప్రభావాన్ని పెంచుకుంటూ, ఆ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న రెహమాన్ దైకత్ను హతమార్చి తన ఆధిపత్యాన్ని స్థాపిస్తాడు. అనంతరం 26/11 ముంబయి దాడులకు ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో ఉగ్రవాద నాయకులు మరియు వారికి మద్దతు ఇచ్చిన రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుంటాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, అతని అసలు నేపథ్యం వంటి అంశాలు చిత్రంలో ప్రధానంగా చూపించబడతాయి.
Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ రిపోర్ట్..!
సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులను కట్టిపడేయవచ్చని గతంలో వచ్చిన కొన్ని చిత్రాలు నిరూపించాయి. ‘దురంధర్-2’ సుమారు నాలుగు గంటల నిడివి కలిగిన చిత్రం. అయినప్పటికీ, మొదటి భాగాన్ని ఇష్టపడ్డ ప్రేక్షకులకు ఇది ఎక్కడా విసుగుని కలిగించదు. కథనంలో ఉన్న ఉత్కంఠ, భావోద్వేగాలు, ఎలివేషన్లు ప్రేక్షకులను చివరి వరకు ఆకట్టుకుంటాయి.
మొదటి భాగంలో స్పై కథనానికి కొత్త కోణాన్ని అందించిన దర్శకుడు, రెండో భాగంలో హీరో గతాన్ని విశ్లేషిస్తూ కథను ప్రారంభిస్తాడు. అనంతరం ప్రస్తుత కాలానికి వచ్చి, హంజా ఎలా వ్యూహాత్మకంగా ఎదిగాడు, పాకిస్థాన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాడు, తన లక్ష్యాలను ఎలా సాధించాడు అనే అంశాలను ఆసక్తికరంగా చూపించాడు. కథ సింపుల్‌గా అనిపించినప్పటికీ, తెరపై అది ఉత్కంఠభరితంగా మలచబడింది.
Also Read : బంగ్లా బోర్డును వెంటాడుతున్న టి20 ప్రపంచకప్..!
చిత్రంలో కొన్ని ప్రత్యేక ఘట్టాలు విశేషంగా నిలుస్తాయి. ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం పాత్ర ప్రవేశం కథలో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. అలాగే ల్యారీ సింహాసనం పై హంజా అధిష్టానం, డ్రగ్ డీలర్ స్నేహితుడితో జరిగిన ఘర్షణ వంటి సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ద్వితీయార్థంలో భావోద్వేగాలు మరియు ఎలివేషన్లు బలంగా పనిచేశాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోని సన్నివేశం, చివర్లో మాధవన్ పాత్రతో కూడిన ఫోన్ కాల్ ఎపిసోడ్ ప్రేక్షకులకు గూస్బంప్స్ కలిగిస్తాయి.
అయితే, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు అధికంగా ఉండటం అందరికీ నచ్చకపోవచ్చు. మొదటి భాగంలో బలంగా నిలిచిన విలన్ పాత్రకు సమానమైన ప్రతినాయకుడు ఈ భాగంలో కనిపించకపోవడం లోటుగా అనిపిస్తుంది. అలాగే రాజకీయ అంశాలు, ప్రాపగండా కోణం, అతిశయోక్తి ఉన్న సన్నివేశాలు కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించే అవకాశముంది.
మొత్తంగా చూస్తే, ఈ విమర్శలు ఉన్నప్పటికీ ‘దురంధర్: ది రివెంజ్’ ప్రేక్షకులను నాలుగు గంటల పాటు కట్టిపడేయడంలో విజయవంతమైంది. ఆదిత్య ధర్ తన కథనం, మేకింగ్‌తో మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించాడు.
చివరగా ఒక్క మాటలో చెప్పాలి అంటే.. దురంధర్ ది రివెంజ్ దుమ్మురేపింది అని చెప్పుకోవచ్చు.
రేటింగ్- 3.3/5

