దసరా పండుగ అంటే మైసూర్, కోల్‌కతాలతో పాటు విజయవాడ గుర్తుకు వచ్చేలా ఈ ఏడాది విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమైన ఈవెంట్‌లో ఇప్పటికే విజయవాడతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా నిర్వాహకులు సెలబ్రెట్ చేస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై ప్రస్తుత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రశంసల జల్లు కురిపించారు. మరోవైపు విజయవాడ ఉత్సవ్‌తో పాటు విజయవాడ ఎక్స్ పో కూడా కొనసాగుతోంది.
Also Read : గంజా బ్యాచ్ కు చుక్కలే.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల స్పీడ్
విజయవాడ ఉత్సవ్ ముగింపు సందర్భంగా నిర్వాహకులు మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2 గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విజయవాడ బందరు రోడ్‌లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ కార్నివాల్‌లో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి 3000 మంది కళాకారులు తమ సాంప్రదాయ జానపద కళారూపాలతో అలరించనున్నారని ఎంపీ పేర్కొన్నారు.
వెయ్యి మంది డప్పు కళాకారులు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరనాట్యం (50 మంది) , గరగలు (60 మంది), కొమ్ముకోయ (50 మంది), దింసా (30 మంది), తప్పెటగుళ్లు (50 మంది), పులి వేషాలు (30మంది), చెక్క భజన (50మంది), కోలాటం (50మంది), బుట్టబొమ్మలు (50మంది), గారడి (50మంది), యుద్ధకళలు (50 మంది), బేతాళ వేషాలు (135 మంది), కాళికా వేషాలు (15 మంది), కర్రసాము (40 మంది), టీన్ మార్ (40 మంది), కేరళ డ్రమ్ములు (50 మంది), సన్నాయి మేళం (30మంది ), కాంతార వేషాలు (30 మంది), కథాకళి (20 మంది), స్టిక్ వాకర్స్ (4 గురు), పగటి వేషాలు (20 మంది), కర్ణాటక వేషాలు (20 మంది), శంఖనాథం (10 మంది), నాసిక్ డోల్ (50 మంది), బొంబాయి (కాళి ) (8మంది), పోతురాజులు (30 మంది), లంబాడీ వేషాలు (50 మంది ) కళాకారులు ప్రదర్శించనున్నారు.
Also Read : అమెరికా షట్ డౌన్.. ప్రమాదంలో వారి ఉద్యోగాలు..!
ఈ కళాకారులు మండపేట, రావులపాలెం, రంపచోడవరం, అరకు, బొబ్బిలి, రేపల్లె, విజయనగరం, విజయవాడ (కృష్ణలంక, వన్ టౌన్, అజిత్ సింగ్ నగర్, యనమలకుదురు), శ్రీకాకుళం, రాజమండ్రి, భద్రాచలం, ఖమ్మం, వరంగల్, కర్ణాటక, గుంటూరు, తాడేపల్లి గూడెం, ధర్మవరం,కర్నూల్ ప్రాంతాలకు చెందిన కళాకారులకే కాకుండా ఇతర రాష్ట్రాలు పుణే,బొంబాయి, హైదరాబాద్, నుంచి కూడా వచ్చి దసరా కార్నివాల్ లో పాల్గొనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మరికొన్ని కళారూపాలు ప్రదర్శించే మరో వెయ్యి మంది కళాకారులతో కలిసి మొత్తంగా 3 వేల మంది కళాకారులు పాల్గొని విజయవాడ ప్రజలకు దసరా సంబరాలను మరింత వైభవంగా మార్చనున్నారని వివరించారు.
విజయదశమి పండుగ సందర్భంగా విజయవాడ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకురావడమే లక్ష్యంగా “సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ” ఆధ్వర్యంలో కార్నివాల్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించేందుకు ప్రయత్నం చేయనున్నామని ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు. విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, స్థానిక కళాకారులకు కొత్త ఉత్సాహాన్ని నింపే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు.