తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ఏపీలో సొంత పార్టీలోనే లుకలుకలతో టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు అధినేత తీరుపై వైసీపీ నేతలు నానా పాట్లు పడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని రుజువు చేయాలనేది బీఆర్ఎస్ నేతల లక్ష్యం. ఇదే సమయంలో ఎన్నికల్లో గెలుపుతో ప్రభుత్వంపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని.. అదే సమయంలో గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలనేది కాంగ్రెస్ పార్టీ నేతల లక్ష్యం. అందుకే ఓ వైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్నా.. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.
Also Read : కాంగ్రెస్ కోటలో జూబ్లీహిల్స్ గుబులు..!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. ఇప్పటికే మంత్రివర్గంలో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఎప్పటి నుంచో మంత్రివర్గంలో స్థానం కోసం సీనియర్ నేతలు ఇప్పటికే పైరవీలు చూస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మధుయాష్కీ వంటి సీనియర్ నేతలు పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేబినెట్ విస్తరణ ఎప్పుడనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు నోరు మెదపటం లేదు. ఇప్పటికీ కొన్ని నామినెటేడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. అయినా సరే.. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రక్షాళన ఉంటుందని అంతా భావించారు. కానీ.. ఆ ఎన్నిక వాయిదా పడటంతో ఆశావహుల ఆశలపై నీళ్లు జల్లినట్లు అయ్యింది. ఇదే సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేయాలనే సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : గుడ్ న్యూస్: ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు..?
జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ప్రస్తుత క్యాబినెట్ నుంచి ముగ్గురు మంత్రులను తప్పించి.. వారి స్థానంలో ముగ్గురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇప్పటికే పార్టీ పెద్దలతో కూడా చర్చించినట్లు సమాచారం. కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌పై వేటు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. వీరి స్థానంలో ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి, బాలు నాయక్‌లకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మహేష్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ నుంచి తప్పించి.. పొన్నం ప్రభాకర్‌కు ఆ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ స్థానంలో మహిళల కోటాలో విజయశాంతికి మంత్రిపదవి ఖాయమంటున్నారు హస్తం పార్టీ పెద్దలు.

