ప్రజలకు సంక్షేమం అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంటే కొందరు దాన్ని సహించలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో మంచి జరుగుతుంటే దాన్ని అడ్డుకునేలా కుట్రలు పన్నే ఒక పెద్ద నేరస్తుడు ప్రత్యర్థిగా మారాడన్నారు. అయితే అటువంటి కుట్రలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఛేదిస్తూ ప్రజలకు నిజాలు వెల్లడిస్తోందని స్పష్టం చేశారు.
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం తెలిపారు. ‘సూపర్ సిక్స్’ పథకాల కింద తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, స్త్రీశక్తి ఉచిత బస్సు వంటి పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. అదే సమయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ట్రిపుల్ ఇంజిన్’ పాలన సాగుతోందని పేర్కొన్నారు.
Also Read : భారత్ కు భయపడుతోన్న బంగ్లా ఆటగాళ్ళు..?
ప్రజలపై భారం తగ్గించడమే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు చెప్పారు. గతంలో ట్రూ-అప్ ఛార్జీలతో కరెంటు భారం మోపారని, ఇప్పుడు ట్రూ-డౌన్ విధానంతో విద్యుత్ బిల్లులు తగ్గించామని తెలిపారు. రూ.4,500 కోట్ల భారం ప్రజలపై వేయకుండా ప్రభుత్వం తానే భరిస్తోందని, భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేశామని, విశాఖకు గూగుల్ వంటి పెద్ద సంస్థలు వస్తున్నాయని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని, దాన్ని ఒక యజ్ఞంలా భావించి పూర్తి చేస్తున్నామని సీఎం అన్నారు. 2027 మార్చిలోగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. నీటి వివాదాలు సృష్టించకుండా తెలుగుజాతి ప్రయోజనాల కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. పట్టిసీమ వంటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరిగిందని, రాయలసీమను నీటి కొరత నుంచి బయటకు తీసి ఉద్యాన హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
Also Read : పీక్స్ కు ఫ్యాన్స్ వార్.. రగిలిపోతున్న రెబల్ ఫ్యాన్స్..!
తిరుమలలో ప్రసాద కల్తీ, రాజధాని అంశం, పీపీపీ ప్రాజెక్టులపై జరుగుతున్న ఆరోపణలను సీఎం ఖండించారు. గత పాలకుల విధ్వంసం వల్ల పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులు నష్టపోయాయని, వాటిని సరిదిద్దడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందన్నారు. సుస్థిర పాలన ఉంటేనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

