రిఫరెండం.. అంటే ప్రజాభిప్రాయ సేకరణ.. ఒక దేశం లేదా ప్రాంతంలోని ఓటర్లందరూ నేరుగా ఓటు వేసి, ఒక నిర్దిష్ట చట్టం, రాజ్యాంగ సవరణ లేదా కీలకమైన రాజకీయ అంశంపై తమ అంగీకారాన్ని లేదా వ్యతిరేకతను తెలిపే ప్రక్రియ. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఒక ఉదాహరణ. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఎన్నికలు రిఫరెండం అంటారు. ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలం తర్వాత ఎన్నికలు జరిగితే.. ఆ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేసే పాలనకు నిదర్శనం. ఆ పార్టీ పరిపాలనకు ప్రజలు అనుకూలంగా ఉన్నారా.. లేదా.. ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తున్నారా.. లేదా అనేది తేల్చేది ఎన్నికలు మాత్రమే. అందుకే.. ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారి.. రిఫరెండం అనే మాట బాగా వినిపిస్తుంది.
Also Read : నగరిలో టిడిపికి ఏకగ్రీవం వెనుక రోజా పాత్ర?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న చోట నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 28న ఓటింగ్ కూడా జరగనుంది. అయితే ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు రిఫరెండం అని భావిస్తారు. ఇదే మాటను ప్రతిపక్షంలో ఉన్న నేతలు పదే పదే చెప్పి.. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని ప్రజలకు వివరిస్తారు. అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న తప్పులను కూడా ప్రజలకు వివరించడంతో పాటు.. తమ హయాంలో జరిగిన మేలు కూడా వివరించి.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కంటే కూడా.. ప్రతిపక్షం కోసం పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే రిఫరెండం అనే మాట బాగా వినిపిస్తోంది. అదేంటి.. అసలు జగన్ అసెంబ్లీకే రావటం లేదు కదా.. ఓడిపోయిన వైసీపీకి రెఫరెండం ఎలా అవుతుందనే అనుమానానికి రాజకీయ విశ్లేషకులు వివరణ ఇస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజధానిగా అమరావతికి బదులుగా.. మూడు రాజధానులనే ప్రతిపాదన చేశారు జగన్. విశాఖను పరిపాలన రాజధాని అంటూ ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. దీంతో మా ఓటర్లు వేరే ఉన్నారని సజ్జల చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది కూడా.
Also Read : సొంతగడ్డపై నామినేషన్లు వేయించలేకపోయిన జగన్..!
అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులని ప్రకటించిన జగన్.. ఓడిన తర్వాత కూడా మూడు ముక్కలాటకు తెర దింపలేదు. అయితే అప్పుడు విశాఖ, అమరావతి, కర్నూలు అని ప్రకటించిన జగన్.. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే పేరు కూడా పెట్టారు. ఈ మూడు కలిపి రాజధానిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తామని.. అప్పుడు మావిగన్ రాజధాని అని ప్రకటించారు. అలాగే విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తామన్నారు.జగన్ మావిగన్ ప్రకటన చేసిన వెంటనే.. వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఆహా, ఓహో. సూపర్ డూపర్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పారు.
ఇప్పుడు ఈ మావిగన్ ప్రతిపాదన వైసీపీకి రిఫరెండంగా మారడం వైసీపీ నేతలు పెద్ద సవాలుగా మారింది. జగన్ చేసిన మావిగన్ పరిధిలోని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఈ మూడు నగరాల మధ్యలో ఉన్న మునిసిపాలిటీల్లో కూడా ఎన్నికలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఈ మూడు నగరాల మేయర్ స్థానాలు సహా.. కార్పొరేటర్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిస్తే.. ఏపీ ప్రజలు మావిగన్‌కు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా కూటమి అభ్యర్థులు గెలిస్తే మాత్రం.. మావిగన్ ప్రతిపాదన.. ఓ దండగ అంటూ ఓటరు తీర్పు ఇచ్చినట్లు అవుతుంది.
Also Read : అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన లోకేష్..!
ఇదే సమయంలో విశాఖను తానే అభివృద్ధి చేశానని, భోగాపురం ఎయిర్ పోర్టు, గూగుల్ డేటా, అదానీ డేటా, రిలయన్స్ డేటా, టాటా క్యాన్సర్ ఆసుపత్రి సహా ఎన్నో అభివృద్ధి పనులు తన హయాంలోనే జరిగాయనేది జగన్ చెబుతున్న మాట. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. అయినా సరే.. ఇప్పటికీ.. తానే విశాఖను అభివృద్ధి చేసినట్లు జగన్ చెబుతున్నారు. అదే నిజమైతే.. విశాఖ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి భారీ మెజారిటీతో ఈ ఎన్నికలో గెలవాలి. కానీ ఆమె ఓడితే మాత్రం.. జనాలు “విశాఖలో జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు” అని తీర్పు ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఈ ఎన్నికలు కూటమి ప్రభుత్వం కంటే కూడా.. వైసీపీకే రిఫరెండం అంటున్నారు.


