కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండల వాడి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటారు. స్వామి వారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పిసున్నారు కూడా. స్వామి వారి ఖాతాలో వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. నిత్యం 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వీరిలో సామాన్యుల నుంచి వీఐపీల వరకు వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం ప్రోటోకాల్ దర్శనం చేసుకునే వీఐపీలకు రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచం అందిస్తారు. అలాంటి వారికి స్వామి వారి ప్రసాదం, శేషవస్త్రం బహుకరిస్తారు. రాష్ట్రపతి, గవర్నర్, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు.. ఇలా ఎవరైనా సరే.. వారికి వేద ఆశీర్వచనంతో పాటు పట్టు శాలువా కప్పుతారు.
Also Read : సీనియర్ దూకుడుకు తెలుగు తమ్ముళ్ల బ్రేకులు
తిరుమల ఆలయ పవిత్రతపై ఇప్పటికే ఎన్నో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే అంశంపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో పరకామణి చోరీ కేసులో కూడా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. 900 డాలర్లు చోరీ చేసిన రవికుమార్ నుంచి ఏకంగా రూ.14.5 కోట్లు విలువైన ఆస్తులను ఎవరు రాయించారు.. ఈ కేసు రాజీకి కారణాలేమిటనే విషయంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఈ చోరీ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన రైల్వే సీఐ అనుమానాస్పద మృతి తర్వాత ఈ పరకామణి కేసులో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుల్లో ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు కూడా.
ఈ రెండు వ్యవహారాల్లో దర్యాప్తు ఇంకా ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. స్వామి వారి వేద ఆశీర్వచనం తీసుకునే భక్తులకు అందించే పట్టు శేషవస్త్రం అసలైంది కాదని తేలింది. వీఆర్ఎస్ ఎక్సపోర్ట్ సంస్థ పట్టు పేరుతొ పాలిస్టర్ సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. 2014 నుంచి 2025 వరకు పట్టు పేరుతొ కాంట్రాక్టర్ పాలిస్టర్ శాలువాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సిల్క్ బోర్డు నిర్వహించిన నాణ్యత పరీక్షలో అవి పట్టు కాదు పాలిస్టర్ అని వెల్లడైంది. మొత్తం రూ.54 కోట్ల విలువైన శాలువాలను టీటీడీ కొనుగోలు చేసింది. తాజాగా కుంభకోణంపై చర్చించిన టీటీడీ అధికారులు పాలకమండలి దృష్టిలో పెట్టారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించేందుకు ఏసీబీ విచారణ కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది. పట్టును ఏమార్చడంలో ఎవరి పాత్ర ఎంత? అనే అంశంపై విచారణలో వెల్లడి అవుతుందని పాలకమండలి సభ్యులు తెలిపారు.
Also Read : రూటు మార్చేసిన అన్న.. మీడియా ముందుకు వాళ్ళే..!
టీటీడీలో శాలువాల స్కాం బయటపెట్టింది తానే అని టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. తిరుపతిలో శాలువ కొనడానికి వెళ్లిన సమయంలో అనుమానం వచ్చిందన్నారు. కొండపైన రూ.1,334 లకు కొన్న శాలువాను కింద షాప్‌లలో అడిగితే రూ.600 అని చెప్పారని నెహ్రూ తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కొనుగోళ్లు ఆపేశామన్నారు. బోర్డు సమావేశంలో చర్చించి విచారణకు ఆదేశించామన్నారు. దేవుడి సొమ్ము వృధా కాకూడదనే లక్ష్యంతో ప్రస్తుత పాలకమండలి పని చేస్తుందని.. ఏసీబీ విచారణలో అసలు దొంగలు బయటకు వస్తారన్నారు జ్యోతుల నెహ్రూ.

