పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు వైసీపీ అగ్రనేతలు ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా చెలరేగిన వైసీపీ కార్యకర్తలపై ఇప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన, జుగుప్సాకరమైన, మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చివరికి పార్టీలో కీలక వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో సగం మంది పైగా సోషల్ మీడియా పులులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఇక గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు అయితే… తప్పు చేశాం.. మన్నించు మహాప్రభో అంటూ లేఖలు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ కార్యకర్తలను గాలికి వదిలేస్తే… తప్పుడు సంకేతాలు వెళ్తాయేమో అనే భయం వైసీపీ నేతలకు పట్టుకుంది. ఐదేళ్ల పాటు జీతం ఇచ్చి మరీ ప్రతిపక్షాలను తిట్టించిన జగన్ పార్టీ నేతలు.. ఇప్పుడు వారిని వదిలేస్తే… తమ పేర్లు బయటకు వస్తాయేమో అని భయపడుతున్నారు. అందుకే తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కడుతున్నారు. తమ వారిని కాపాడాలని వేడుకుంటున్నారు.
Also Read : కౌరవ సభ కాదు.. గౌరవ సభ అని నిరూపించిన అయ్యన్న
దీంతో ఇలాంటి సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలబడేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ అగ్రనాయకులు ప్రకటించారు. అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైసీపీ తరపున ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసమే టాస్క్‌ఫోర్స్ పని చేస్తుందని వెల్లడించారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ టాస్క్‌ఫోర్స్ పని చేస్తుందని ప్రకటించారు. ఈ కమిటీలో ఒక మాజీ ప్రతినిధి ఉంటారని వెల్లడించారరు.
టాస్క్‌ఫోర్స్‌లో శ్రీకాకుళం జిల్లాకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్.. విజయనగరం జిల్లాకు మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్, జోగారావు.. విశాఖపట్నం జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కెకె రాజు, భాగ్యలక్ష్మి.. తూర్పు గోదావరి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ వంగా గీత… పశ్చిమ గోదావరి జిల్లాకు కె.సునిల్‌కుమార్ యాదవ్, జయప్రకాష్ (జేపీ)… కృష్ణా జిల్లాకు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, దేవభక్తుని చక్రవర్తి.. గుంటూరు జిల్లాకు మాజీ మంత్రి విడదల రజని, డైమండ్ బాబు.. ప్రకాశం జిల్లాకు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, వెంకట రమణారెడ్డి… నెల్లూరు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి ఉంటారు.
Also Read : ప్రభాస్ లైనప్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే..!
వీరితో పాటు చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, అనంతపురం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్, కడప జిల్లాకు సురేష్‌బాబు, రమేష్‌యాదవ్, కర్నూలు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి పేర్లను వైసీపీ ప్రకటించింది. వీరంతా టాస్క్‌ఫోర్స్‌ిలో సభ్యులుగా ఉంటారు. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటారని వెల్లడించారు. మరి సోషల్ మీడియాలో పోస్టులకు కూడా ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ బాధ్యత వహిస్తుందా అని ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. దీనికి మాత్రం వైసీపీ నేతల నుంచి ఎలాంటి జవాబు రావడం లేదు.