ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం వరకు నత్త నడకన సాగిన వరద ముంపు ప్రాంతాల్లోని సహాయ కార్యక్రమాలు నిన్న మధ్యాహ్నం నుంచి ఊపు అందుకున్నాయి. నిన్న సాయంత్రం నుంచి చంద్రబాబు దూకుడు చూసిన అధికారులు ఆశ్చర్యపోతున్నారు. తెల్లవారుఝామున నాలుగు గంటల వరకు చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లోనే ఉండి ఆకస్మిక పర్యటనలు చేస్తూ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. సింగ్ నగర్, కృష్ణ లంక, భవానిపురం ఇలా మొత్తం అన్ని ప్రాంతాల్లో కలియ తిరిగారు.
రాత్రి 3 గంటల వరకు ఫెర్రిలోనే ఉన్న ఆయన ఆ తర్వాత మళ్ళీ 4 గంటలకు భవానిపురం వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సమీక్షించారు. ఇక బాధితులకు ఆహారం చేరవేసే విషయంలో చంద్రబాబు ముందుచూపు అందరిని ఆశ్చర్యపరిచింది. విజయవాడలో ఉన్న హోటల్స్ యజమానులతో స్వయంగా మాట్లాడిన ఆయన అక్కడ ఉన్న పాలు, ఇతర ఆహార పదార్ధాలను వెంటనే సింగ్ నగర్ తరలించాలని ఆదేశించారు. ఇక వరద బాధితుల లెక్కను చంద్రబాబు అంచనా వేసిన విధానం సైతం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఓటర్ లిస్టు తో పాటుగా రేషన్ కార్డు లిస్టు అలాగే… సెల్ ఫోన్ నెంబర్లు ఎన్ని పని చేస్తున్నాయో కూడా ఆయన అధికారులను తెలుసుకున్నారు. ఇక అన్ని డివిజన్లకు సంబంధించి లెక్కలను తీసుకుని అధికారులను వెంటనే అప్రమత్తం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే హెలికాప్టర్ లను, పవర్ బోట్స్ ని ఉదయానికి విజయవాడ తెప్పించారు. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్న చంద్రబాబు… అధికారులను ఆ విధంగానే అడుగులు వేయిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పని తీరుతో అధికారులు సైతం అలసత్వం లేకుండా పని చేస్తున్నారు అని తెలుస్తోంది.