దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక భేటీకి అమరావతి వేదిక కాబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కజగం అధినేత సీఎం విజయ్ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశం కానుండటం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ ఇద్దరు నేతల భేటీ వెనుక ఉన్న రాజకీయ ప్రాధాన్యతలపై ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
Also Read : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ సంచలన పిటిషన్..!
అక్కడ ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం 4:15 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సీఎం విజయ్ సమావేశం అవుతారు. ఇరు రాష్ట్రాల సమ్మేళనం, తాజా రాజకీయ పరిణామాలు మరియు ద్వైపాక్షికాంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన అనంతరం, సాయంత్రం 6:00 గంటలకు విజయ్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
Also Read : ఏపీ లోకల్ పోరు.. ఈసీ రిజర్వేషన్ యాక్షన్ ప్లాన్ రెడీ..?
ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. అమ్మవారి దర్శనం, తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం సీఎం విజయ్ రాత్రి 8:30 గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో చెన్నైకి తిరుగుప్రయాణమవుతారు. తమిళనాట సరికొత్త రాజకీయ శకానికి తెరతీసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్.. చంద్రబాబు నాయుడును కలవబోతుండటం ఇరు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనదేనా లేక రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల వ్యూహాలు, జాతీయ రాజకీయ సమీకరణాలపై ఏవైనా కీలక చర్చలు జరగబోతున్నాయా అన్న కోణంలో రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.


