విజయవాడ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ-2025 లో స్పోర్ట్స్ కోటా భర్తీపై సీబీఐ విచారణ జరపాలంటూ వైసీపీ పిలుపునిచ్చిన శాప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు, ఘర్షణకు దారితీసింది. పోలీసులు ముందస్తుగా ఈ ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేస్తూ వైసీపీ కీలక నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్‌లకు నోటీసులు జారీ చేసినప్పటికీ, వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి శాప్ కార్యాలయాన్ని ముట్టడించాయి. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు పోలీసులు కార్యాలయానికి మూడు వైపులా, విజయవాడకు వెళ్లే ప్రధాన కూడళ్లలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : తిరుమల లడ్డూ పై, జగన్ కి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందా?
శాప్ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో ఉద్రిక్తత శిఖరాగ్రానికి చేరింది. అయితే, ఇదే సమయంలో డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా ద్వారా అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కూడా అక్కడకు చేరుకున్నారు. వైసీపీ ఆరోపణలను ఖండిస్తూ, తమ ఉద్యోగాల నియామకాలను సమర్థిస్తూ వారు కూడా ఆందోళనకు దిగారు. శాప్ కార్యాలయం ముందే ఇరు వర్గాలు ఒకరికొకరు పోటీగా నినాదాలు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా భారీ పోలీసు మోహరింపు మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా మారింది.
Also Read : భోజనం చేస్తూ మధ్యలో నీళ్లు ఎక్కువ తాగుతున్నారా..?
ఈ క్రమంలో నిరసన కాస్తా హింసాత్మకంగా మారింది. శాప్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగాయి. అక్కడ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ గూండాలు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన శాప్ డైరెక్టర్‌పై కూడా వైసీపీ శ్రేణులు భౌతిక దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. ఈ దౌర్జన్య కాండకు వ్యతిరేకంగా స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

