ఎవరి మీదైనా నమ్మకం లేకపోతే.. వాళ్లు చెప్పే మాటలు మీద కూడా నమ్మకం ఉండదు. ఎవరైనా అబద్ధాలు చెబుతారనే అనుమానం వస్తే.. వాళ్లు చెప్పే మాటల మీద కూడా ఎలాంటి నమ్మకం ఉండదు. ఇక ఏదైనా విషయంపై గొడవ జరిగితే.. అలా అనుమానం ఉన్న వారి సాక్ష్యానికి బదులుగా వేరే వారిని అడిగి అసలేం జరిగిందో తెలుసుకుంటాం. ఇదే మానవ నైజం. ఇంకా చెప్పాలంటే.. న్యాయస్థానాలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తాయి. ఎవరి మీద అయితే ఆరోపణలుంటాయో.. వాళ్లు చెప్పే సాక్ష్యాన్ని కోర్టు కూడా పరిగణలోకి తీసుకోదు. కానీ వైసీపీ నేతల తీరు చూస్తే మాత్రం ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఎవరి మీద అయితే నమ్మకం లేదంటారో.. ఇప్పుడు వాళ్లు చెప్పిన మాటే సూపర్, ఫైనల్ అంటున్నారు.
Also Read : ఇదేం ఆట గురూ.. ఇషాన్ ఆట తీరుకు ఫిదా..!
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ వైపు సిట్ ఇచ్చిన నివేదికలో పాలు అనేవి లేవని.. రసాయనాలు, ఫిష్ ఆయిల్ ద్వారా నెయ్యి అనే పదార్థం సరఫరా చేసినట్లు స్పష్టంగా ఉంది. అయితే వైసీపీ నేతలు మాత్రం పంది కొవ్వు, గొడ్డు కొవ్వు లేదు అని నివేదికలో ఉంది కాబట్టి.. చంద్రబాబు, పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని.. వారిద్దరు హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని విషయం మొత్తం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై దేవాలయాల ముందు కొబ్బరి కాయలు కొట్టి.. హిందూ పేటెంట్ హక్కు తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే మరో విషయం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదేమిటంటే.. వైసీపీ ఎంపీ, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. కల్తీ నెయ్యి అనేది పూర్తిగా అబద్ధం అని ముందు అన్నారు. ఆ తర్వాత బోలే బాబా అనే సంస్థ టీడీపీ హయాంలోనే వచ్చిందన్నారు. మరి టీడీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మళ్లీ ఎందుకు బోలే బాబాకు కాంట్రాక్ట్ ఇచ్చింది అనే ప్రశ్నకు నో ఆన్సర్. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ పై మాకు నమ్మకం లేదు కాబట్టే తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Also Read : కల్తీ నెయ్యి పై ‘సిట్’ లో జగన్ మనిషి
సిట్ పై నమ్మకం లేదన్న వైవీ సుబ్బారెడ్డి.. సిట్ విచారణతో జంతు కొవ్వు కలవలేదని నివేదికలో స్పష్టమైంది అంటూ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించారు. దీంతో “అసలు ఏం మాట్లాడుతున్నారు సుబ్బారెడ్డి గారు..” అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. ఓ వైపు సిట్ అంటే నమ్మకం లేదు.. అందుకే సుప్రీం కోర్టుకు వెళ్లానంటారు.. మరోవైపు అదే సిట్ ఇచ్చిన నివేదిక కరెక్ట్ అని.. ఎలా అంటున్నారు.. అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిట్ పై నమ్మకం లేకపోతే.. సిట్ ఇచ్చిన నివేదిక కూడా తప్పు అని అనాలి కదా.. అని వ్యాఖ్యానిస్తున్నారు. నేను తప్పు చేస్తే.. సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్తాను.. అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. తప్పు చేయకపోతే.. మీ బ్యాంకు ఖాతాలను సిట్, సీబీఐ అధికారులకు ఎందుకు చూపించటం లేదనేది కూటమి నేతల ప్రశ్న. మొత్తానికి నమ్మకం లేని సిట్ నివేదికనే వైవీ సహా వైసీపీ నేతలంతా నమ్మటం.. ఆశ్చర్యం కలిగిస్తోంది.

