ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎవరికీ అర్థం కావటం లేదు. పైకి మాత్రం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.. కానీ లోపల మాత్రం అంతా కలిసే ఉంటున్నారు. ఈ ముసుగులో గుద్దులాట వ్యవహారం ప్రధానంగా వైసీపీ, బీజేపీ నేతల మధ్య బాగా కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి సర్కార్ అధికారంలో ఉంది. దీంతో చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్‌ను పల్లెత్తు మాట కూడా అనటం లేదు. ఏపీలో బీజేపీ మంత్రి ఆధ్వర్యంలోని వైద్య ఆరోగ్య శాఖపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే కేంద్రంలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీకి తమ వంతు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : ఎంపీలకు లోకేష్ క్లాస్.. పార్లమెంట్ కు వెళ్లాల్సిందే
దేశంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం సర్వ సాధారణం. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కమలం పార్టీ ఖాతాలో ఏకంగా రూ.6 వేల కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి. విరాళాలను ఎలక్టోరల్ బాండ్ రూపంలో అందిస్తారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను 2024 ఫిబ్రవరిలోనే సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయినా సరే.. 2024-25 ఆర్థిక ఏడాదిలో బీజేపీ ఏకంగా రూ.6 వేల కోట్లు విరాళాలు రాగా.. ఇందులో రూ.3,689 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల రూపంలో బీజేపీకి ఇతోదిక సాయం అందాయి. ఇవి మొత్తం విరాళాల్లో 62 శాతానికి సమానం. ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది ఒక వ్యవస్థ. హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన వ్యక్తి లేదా భారత్‌లోని ఏ పౌరుడైనా, కంపెనీ, సంస్థల ద్వారా ఈ ట్రస్ట్‌లకు విరాళాలు ఇవ్వొచ్చు. ఆ ట్రస్టులు రాజకీయ పార్టీలకు డబ్బులను పంపిణీ చేస్తాయి. కంపెనీల చట్టం కింద రిజిస్టరైన ఏ కంపెనీ అయినా సరే భారత్‌లో ఎలక్టోరల్ ట్రస్ట్ ఏర్పాటు చేయవచ్చు.
2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఎలక్టోరల్ ట్రస్ట్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రూ.517 కోట్ల విరాళాల్లో రూ.313 కోట్లు ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారానే వచ్చాయి. 2024-25 ఆర్థిక ఏడాదిలో అంటే.. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 మధ్య కాలంలో బీజేపీకి అత్యధిక విరాళాలు వచ్చాయి. దీంతో అసలు బీజేపీకి అత్యధిక విరాళాలు ఇచ్చింది ఎవరూ అనే చర్చ మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ అందించిన కంట్రిబ్యూషన్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీకి అత్యధిక విరాళం అందించిన వ్యక్తిగా కాటన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ అమృత్లాల్ కోటక్ ఉన్నారు. ఆయన రూ.30 కోట్లను బీజేపీకి విరాళంగా అందించారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కాటన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కోటక్ కొనసాగుతున్నారు. ఆయన తర్వాత స్థానంలో ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సతీమణి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆళ్ల దాక్షాయణి బీజేపీకి అత్యధిక విరాళాలు అందించిన వారి జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, వ్యవస్థాపకులుగా ఉన్న దాక్షాయణి బీజేపీకి రూ.25 కోట్లు విరాళం ఇచ్చారు. రామ్కీ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. సీఎస్ఆర్ సంస్థగా రామ్కీ ఫౌండేషన్ పని చేస్తోంది. దీనిని 2006లో పని చేస్తోంది. రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, వ్యవస్థాపకులు ఆళ్ల దాక్షాయణి వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి భార్య. 2023లో అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్.. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాజ్యసభలో సంపన్నులైన ఎంపీల జాబితాలో అయోధ్య రామిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. 2023లో అయోధ్య రామిరెడ్డి ఆస్తుల విలువ రూ.2,577 కోట్లుగా ఏడీఆర్ నివేదిక పేర్కొంది. వైసీపీ తరఫున పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీకి చెందిన సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు వెల్లువెత్తడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read : రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి అన్ని శాఖలా..!
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. బీజేపీకి వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చిన వారిలో సొంత పార్టీ నేతల కంటే వైసీపీ ఎంపీకి చెందిన సంస్థ నుంచే భారీగా విరాళం అందింది. బీజేపీ నేతలంతా కలిసి తమ సొంత పార్టీకి ఇచ్చిన విరాళం కోటి రూపాయలు కూడా దాటలేదు. ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ జయ్ పండా రూ.6 లక్షలు ఇవ్వగా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అయితే కేవలం రూ.లక్ష మాత్రమే విరాళం ఇచ్చారు. సొంత పార్టీ నేతల కంటే నిత్యం ఆరోపణలు చేస్తున్న వైసీపీకి చెందిన ఎంపీ సంస్థ నుంచి రూ.25 కోట్లు విరాళం రావటమే ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైసీపీ నుంచి పూర్తిస్థాయిలో బీజేపీకి ఆర్థిక సహకారం అందుతుంది కాబట్టే.. ఆ పార్టీ నేతలు ఎన్ని తప్పులు చేసినా సరే.. ఢిల్లీ పెద్దలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది.

