టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టు ఖాయమా.. అంటే అవుననే మాటే వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ముందుగా వెల్లడించింది ఎవరో కాదు.. భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా కూడా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో వైసీపీ అనుకూల ఉద్యోగులు పెత్తనం చేస్తున్నారనేది వాస్తవం. ఈ విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా చెప్పారు కూడా. టీటీడీలో తమ కోసం 2 వేల నిఘా కెమెరాలు పని చేస్తున్నాయన్నారు భూమన.
Also Read : క్వాంటం వ్యాలీ ముహూర్తం ఖరారు..!
తిరుమలలో అపచారం అంటూ నిత్యం ఏదో ఒక అంశంపై భూమన వివాదం రేపుతూనే ఉన్నారు. గోశాలలో ఆవుల మృతి మొదలు.. స్వామి విగ్రహానికి అపచారం అంటూ వీడియో విడుదల చేసే వరకు ప్రతి విషయంలో భూమన టీటీడీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. నాలుగు రోజుల క్రితం తిరుపతిలో డివైడర్ వద్ద ఓ బోర్డుపై ఓ హోటల్ నాన్ వెజ్ ప్రకటన చేసిందని నానా రచ్చ చేశారు. కొందరు వైసీపీ నేతలు పనిగట్టుకుని మరీ క్యూ లైన్ సరిగ్గా లేదని ఆరోపణలు చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు భూమన ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి కూటమి నేతలతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి.
తాజాగా భూమన అక్రమాలపై టీటీడీ విజిలెన్స్ అధికారులు నివేదిక రూపొందించారు. ఇంజనీరింగ్ పనుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపించారు. దీంతో గోవిందరాజస్వామి ఆలయ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమనపై కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. భూమనపై కేసు పెడతారని.. ఆయనను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోందని వైసీపీ నేతలకు ముందే తెలిసిపోయింది. ఇందుకు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ.
Also Read : ఏం చేసుకుంటారో చేసుకోండి.. పాకిస్తాన్ కు ఐసీసీ షాకింగ్ రిప్లై
భూమన అక్రమ అరెస్ట్‌తో ..వైసీపీ నోళ్లు మూయించలేరు.. అంటూ సోషల్ మీడియాలో అభినయ్ రెడ్డి పోస్ట్ చేశారు. “కొంత కాలంగా టీటీడీ పాలక మండలికి, కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిన వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందని, కొంత మంది కాంట్రాక్టర్లతో అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇప్పించుకున్న విజిలెన్స్ అధికారులు మా నాయకుడు కరుణాకరరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్ట్‌లు, జైళ్లతో ఉద్యమాలకు మారుపేరైన కరుణాకరరెడ్డి గారిని , అలాగే తిరుపతి నియోజకవర్గ, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తల నోళ్లు మూయించాలని అనుకోవడం అవివేకం. ఇలాంటి వాటికి భయపడే నైజం భూమన కరుణాకర్‌రెడ్డి గారిది కానేకాదు. కూటమి పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి, కట్టుకథలతో , అక్రమ కేసుతో మా నాయకుడి అరెస్ట్‌కు సిద్ధమైన టీటీడీ విజిలెన్స్ …మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయి. అయితే జైలు నుంచి ఇంతకు వందింతలు శక్తితో మా నాయకుడు కరుణాకరరెడ్డి గారు తిరిగి వస్తారు. అప్పుడు మరింత బలంగా, శక్తిమంతంగా టీటీడీలో ప్రస్తుత పాలకులు చేస్తున్న తప్పుల్ని, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని కరుణాకరరెడ్డి గారి నాయకత్వంలో తిప్పి కొడతాం. దేశంలో ఎమెర్జెన్సీని వ్యతిరేకిస్తూ అత్యంత చిన్న వయసులోనే జైలును ముద్దాడిన పోరాట పటిమ, స్ఫూర్తి భూమన కరుణాకరరెడ్డి గారిది. అలాంటి నాయకుడిపై టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాల సాకుతో అరెస్ట్ చేయాలని అనుకోవడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం లాంటిదే. ఇలాంటి వాటికి భూమన , వైసీపీ అభిమానులెవరూ భయపడకపోగా, మరింత శక్తిని కూడగట్టుకుని ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతామని హెచ్చరిస్తున్నాం.” అంటూ భూమన అభినయ్ రెడ్డి పోస్ట్ చేశారు.
Also Read : తిరుమల.. వారి పట్ల మరింత కఠినంగా..!
ఈ నెల 16వ తేదీ మంగళవారం మధ్యాహం 2 గంటల 13 నిమిషాలకు భూమన అభినయ్ రెడ్డి ఈ పోస్ట్ చేశారు. అయితే కరుణాకర్ రెడ్డ మీద సాయంత్రం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరి ఈ ఫిర్యాదు విషయం అభినయ్ రెడ్డికి ముందే ఎలా తెలిసింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్. టీటీడీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలు ముందే బయటకు ఎలా వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ఓ మాజీ ఛైర్మన్ అక్రమాలపై విచారణ, ఫిర్యాదు విషయాలు ఎంతో గోప్యంగా ఉంచుతారు. వాస్తవానికి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు టీటీడీ బోర్డు సభ్యులు కూడా వెల్లడించలేదు. కానీ అభినయ్ రెడ్డ మాత్రం ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి.. అంటూ తన తండ్రి మీద ఏ కేసులో ఫిర్యాదు చేయనున్నారనే విషయం కూడా వెల్లడించారు. అంటే అత్యంత రహస్యంగా ఉండాల్సిన విషయం ముందే బయటకు ఎలా వచ్చిందనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇలా ముందే లీక్ చేస్తే.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా అనేది న్యాయ నిపుణుల మాట. మరి ఇలాంటి వైసీపీ కోవర్టుల పట్ల టీటీడీ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. ఇలాంటి వైసీపీ కోవర్టులను ఎలా బయటకు తీస్తారో చూడాల్సి ఉంది.