మంత్రి కొండా సురేఖ – అక్కినేని నాగార్జున మధ్య వివాదం సద్దుమణిగింది. నాగార్జున కుటుంబంపైన, సమంత, నాగ చైతన్య ల పైన కొండా సురేఖ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. దీంతో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. ఈ కేసు విచారణ కోసం ఇప్పటికే నాగార్జున, అమల, నాగ చైతన్య కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు కూడా. దీంతో కొండా సురేఖపై కేసు విషయంలో అక్కినేని కుటుంబం వెనక్కి తగ్గదని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారు. దీంతో అనూహ్యంగా నాగార్జున కూడా మంత్రి కొండా సురేఖ పై వేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకున్నారు.
Also Read : ఫ్యాన్స్ కు జక్కన్న షాక్.. అవన్నీ ఫేక్ అంటూ వీడియో
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా చేపట్టిన కూల్చివేతల్లో ప్రధానమైనది ఎన్ కన్వెన్షన్. అదే సమయంలో నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవి అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. దీంతో అక్కినేని ఫ్యామిలీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో నాగార్జున కూడా ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టలేదు. కొండా సురేఖపై పరువు నష్టం దావాతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఒక అడుగు వెనక్కి వేసిన మంత్రి కొండా సురేఖ.. తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నాను.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాగార్జునను, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనేది తన ఉద్దేశం కాదన్న మంత్రి సురేఖ.. తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే చింతిస్తున్నా.. అంటూ వ్యాఖ్యానించారు.
కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పిన గంటల వ్యవధిలోనే అక్కినేని కుటుంబం కూడా వెనక్కి తగ్గింది. కొండా సురేఖపై వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకుంది. ఈ మేరకు కోర్టుకు నాగార్జున లేఖ రాశారు. అయితే ఈ ఆసక్తికర పరిణామం వెనుక ఏం జరిగిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ, నాగార్జున మధ్య రాజీ కుదిరేందుకు కారణాలేంటి అనే చర్చ ఇప్పుడు అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు సినీ వర్గాల్లో జరుగుతోంది. వీరిద్దరి మధ్య రాజీ వెనుక ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడనే మాట వినిపిస్తోంది. ఆర్జీవీకి ఇటు సినీ పరిశ్రమతో పాటు అటు పొలిటికల్ సర్కిల్‌లో మంచి పరిచయాలు ఉన్నాయి. రాజకీయ ప్రముఖుల పైన, వివాదాస్పద అంశాలపైన ఆర్జీవీ సినిమాలు తీస్తూనే ఉన్నారు.
Also Read : మాగంటి కోట కూలింది.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ భారీ ఆధిక్యం..!
తాజాగా కొండా మురళీ నేపథ్యం పైన కొండ పేరుతో ఆర్జీవీ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా కోసం తరచూ కొండా దంపతులను ఆర్జీవీ కలుస్తున్నారు కూడా. ఇక శివ సినిమా రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం నాగార్జునతో ఆర్జీవీ ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావా కేసు విషయంపై ఆర్జీవీ చర్చించినట్లు సమాచారం. అయితే క్షమాపణ చెబితే.. తాను కేసు విత్ డ్రా చేసుకుంటానని నాగార్జున కండీషన్ పెట్టడంతో.. వెంటనే ఆ ప్రపోజల్‌ను కొండా దంపతుల ముందు ఉంచినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆర్జీవీ చేసిన రాజీ ప్రయత్నం ఫలించడంతో.. కొండా సురేఖ క్షమాపణ.. ఆ వెంటనే నాగార్జున తన కేసు ఉపసంహరణ చకచకా జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న వివాదానికి రామ్ గోపాల్ వర్మ పుల్ స్టాప్ పెట్టేందుకు చేసిన రాజీ ప్రయత్నం మంచి ఫలితమే చూపిందనే మాట ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

