ప్రతి ఏటా తిరుమలలో వైభవంగా జరుగుతున్న వైకుంఠ ఏకాదశి పండుగ ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై వస్తున్న ఆరోపణలను టీటీడీ బోర్డు కొట్టిపారేసింది. వైకుంఠ ద్వార దర్శనాన్ని కేవలం 2 రోజులకే కుదించాలనే ప్రతిపాదన రాలేదని పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అలాగే ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. బ్రహ్మోత్సవాల విజయవంతంలో భాగస్వాములైన ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఇతర విభాగాల సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, సహకరించిన మీడియాకు, భక్తులకు టీటీడీ బోర్డు అభినందనలు తెలియజేసింది. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పని చేసిన టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం అందివ్వనున్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ లేదా జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10 శాతం ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read : సాక్షి కులం రాతలు.. కాపు మహిళపై ప్రచారం
తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఇందులో పలు అంశాలపై చర్చించిన పాలకమండలి సభ్యులు.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాణిపాకంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ధర్మ ప్రచారంలో భాగంగా గ్రామాల్లో భజన మందిరాలు నిర్మించనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో గదుల టారీఫ్‌లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ వెల్లడించారు. టీటీడీ గోశాల నిర్వహణకు సంబంధించి కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిధి భవనాన్ని నిర్మించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, సామూహిక వివాహాలకు ప్రత్యేక హాల్స్ నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అనుమతి కొరకు పంపాలని నిర్ణయించారు.
Also Read : చంద్రబాబు ఇలా.. మరి జగన్ అయితే..?
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టి.నగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం పరిధిలో ఉన్న 6,227 చదరపు అడుగుల స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్‌లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగోపురం, నాలుగు మాడ వీధులు, తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ.10 కోట్లు దాతల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదా శివమూర్తిని తొలగించాలని నిర్ణయించారు. అలాగే టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీతో సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు.

