వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. మోథా తుఫాన్ వెళ్లిన దాదాపు నెల రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన జగన్.. కూటమి సర్కార్‌ను తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అర్థమవుతోంది. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతే.. అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కారణమన్నట్లుగా జగన్ వ్యాఖ్యానించారు. గంట పాటు సాగిన జగన్ మీడియా సమావేశంలో కేవలం చంద్రబాబును దూషించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. అయితే జగన్ చేసిన ఆరోపణలకు కూటమి సర్కార్ ఘాటుగా బదులిచ్చింది. ఫేక్ జగన్… ఫేక్ ప్రచారాలు పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. జగన్ చేసిన ప్రతి ఆరోపణకు లిఖితపూర్వకంగా జవాబు చెప్పింది ప్రభుత్వం.
Also Read : జగన్ గుండెల్లో అమరావతి రైళ్లు.. షాక్ ఇవ్వనున్న కేంద్రం..!
ఉనికి కోసం తప్ప.. ప్రజల కోసం జగన్ రెడ్డి ఆలోచించలేదని.. నెలకోసారి బెంగళూరు నుండి ఛార్టెడ్ ఫ్లైట్లో రావడం.. నాలుగు గోడల మధ్య సొంత మీడియాను పిలిపించుకుని.. మాట్లాడితే ప్రజలకు ఒరిగిందేంటి అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా కుట్రలు చేయడమే జగన్ లక్ష్యమని.. పిన్నెల్లి, జోగి రమేశ్ లాంటి అరాచక శక్తుల్ని వెనకేసుకు రావడంతోనే జగన్ అజెండా ఏంటో ప్రజలు గుర్తించారన్నారు. మహిళా లోకాన్ని కించపరిచిన కొమ్మినేనికి మద్దతు తెలపడం, డ్రగ్స్, గంజాయి స్మగర్లను వెనకేసుకు రావడం, రైతుల్ని భయబ్రాంతులకు గురి చేయడమే అజెండా అని మరోసారి నిరూపించుకున్నారన్నారు. పరకామణిలో స్వామివారి కానుకలను దొంగిలించిన దొంగలకు జగన్ రెడ్డి క్లీన్ చిట్ ఇవ్వడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అని.. ఫేక్ ప్రచారాలు.. ఫేక్ ఆరోపణలతో ఉనికి చాటుకోవడానికి జగన్ ఆరాటపడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ మీడియా సమావేశాల్లో ప్రజా సమస్యలపై చిత్తశుద్ది కాదు.. తన పార్టీ, తన ఉనికి చాటుకోవాలి అనే తాపత్రయం కనిపిస్తోందని.. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం అనిపించాలనే జగన్ సిద్ధాంతానికి కాలం చెల్లిందన్నారు టీడీపీ నేతలు.
ప్రజలకు వాస్తవాలు తెలుసని.. జవాబుదారీగా తాము వ్యవహరిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేదని… సూపర్ సిక్స్ అమలు కాలేదని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. రాజకీయాల్లో మోసంతో, తప్పుడు ప్రచారంతో లబ్ది పొందలేరన్న విషయం జగన్ తెలుసుకోవాలని సూచించారు. జగన్ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే.. 18 నెలల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఒక్కో పథకం అమలు చేస్తూ ముందుకు నడుస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి చంద్రబాబు సూపర్ హిట్ కొట్టారన్నారు. తల్లికి వందనం కింద 67 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున రూ.10 వేల కోట్లు ఇచ్చామన్నారు. దీపం-2 కింద ఇప్పటి వరకు 2.85 కోట్ల సిలిండర్లు ఉచితంగా అందించామన్నారు. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని.. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.885 కోట్లు లబ్ది చేకూర్చామన్నారు. మెగా డీఎస్పీతో ఒక్క ఏడాదిలోనే 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయం జగన్‌కు గుర్తులేదా అని ఎద్దేవా చేశారు.
అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో కలిపి రూ.6310 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్న టీడీపీ నేతలు.. ఒక్క పించన్ల ద్వారానే ఇప్పటి రూ.50 వేల కోట్లు పంపిణీ చేశామని ప్రకటించారు. మత్స్యకారుల సేవలో పథకంతో రూ.259 కోట్లు ఇచ్చిన విషయం జగన్‌కు తెలియదనుకుంటా అని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తే 24 గంటల్లో డబ్బులు వేస్తున్నామన్న కూటమి పెద్దలు.. ఇవన్నీ జగన్ హాయంలో ఉన్నాయా? అని నిలదీశారు. ఈ వాస్తవాలు బయటకు రాకుండా… వీటిపై చర్చ జరగకుండా జగన్ తప్పుడు ప్రచారాలతో రోజూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క రోజు కూడా పొలంలోకి అడుగపెట్టని జగన్ ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి అన్న దాతల గురించి మాట్లాడుతుంటే.. రైతులే నవ్వుకుంటున్నారన్నారు. జగన్ రెడ్డి.. పొరుగు రాష్ట్రంలో ఫుల్ టైమ్.. ఏపీలో పార్ట్ టైం ఉంటున్నాడన్నారు. ప్రజల కష్టార్జితాన్ని పందికొక్కులా దోచుకుని యలహంక ప్యాలెస్‌లో ఉన్న జగన్.. ప్రజల కోసం నిరంతరం కష్టబడే కూటమి నాయకుల్ని గాడిదలు అంటూ నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు.
Also Read : చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్న సిఎం..!
గత ఐదేళ్లు రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి రేటు ఎంత.? అని కూటమి పెద్దలు ప్రశ్నించారు. 2019-24 మధ్య వ్యవసాయ వృద్ధి రేటు 10.22 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. నాడు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేశాక.. డబ్బుల కోసం రైతుల్ని నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుని వేధించారని.. కానీ నేడు గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఏ రోజైనా.. బోనస్ ఇచ్చి మామిడి, పొగాకు, వేరుశనగ, మిర్చి కొన్నారా? అని నిలదీశారు. కల్తీ లిక్కర్ వ్యాపారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినా జగన్ రెడ్డి ప్రజల్ని మభ్యబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ కుట్రలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జోగి రమేశ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మద్దతు తెలపడం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలతో పేట్రేగిపోయిన పిన్నెల్లి సోదరులు, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన జోగి రమేశను వెనకేసుకొస్తున్నాడని జగన్‌ను ప్రశ్నించారు.

