పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఎంత కీలకమో ప్రజలందరికీ తెలిసిందే. అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అటు తిరిగి, ఇటు తిరిగి పాలకుల అధికార స్వార్ధానికి బలైపోతుందేమో అనే ఆందోళన ఇప్పుడు ప్రజల్లో మొదలయింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను చాలా సీరియస్ గా తీసుకుని పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. అయితే 2019 లో ప్రభుత్వం మారిన తర్వాత పనుల వేగం మందగించింది. అప్పట్లో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్ నుంచి అప్పటి వరకు నిర్మిస్తున్న సంస్థను తప్పించారు. ఆ తర్వాత మెగా కంపెనీకి పోలవరం పనులను అప్పగించారు. ఈ సంస్థ మొత్తం ప్రాజెక్ట్ లో 800 కోట్ల వరకు ఆదా చేస్తుంది కాబట్టి ఇచ్చామని జగన్ సర్కార్ గొప్పగా ప్రకటించింది.
ఆ గొప్ప మాటల వరకే ఆగింది గాని… మళ్ళీ అంచనాలను పెంచారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం ఐదేళ్ళలో కనీసం 5 శాతం కూడా జరగలేదు. ఈ ఏడాది మళ్ళీ ప్రభుత్వం మారింది. పోలవరం ప్రాజెక్ట్ ను సీరియస్ గా తీసుకునే ప్రభుత్వం వచ్చింది. కాంట్రాక్టు సంస్థను మార్చితే ఇక పనులు స్పీడ్ పెరుగుతాయి అని ప్రజలు భావించారు. కానీ అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. అప్పుడు నానా తిట్లు తిట్టిన మెగా సంస్థనే ఇప్పుడు మళ్ళీ పనులు చేయాలంటూ, ఆ సంస్థనే కొనసాగిస్తాం అంటూ కేంద్ర జల శక్తి మంత్రికి స్పష్టంగా చెప్పింది.
పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి శాఖ మంత్రితో సీఎం భేటి నిర్వహించి పోలవరం ప్రాజెక్ట్ పై ప్రధానంగా చర్చించారు. సీఆర్ పాటిల్‌తో చంద్రబాబుతో పాటుగా నిమ్మల రామానాయుడు కూడా సమావేశం అయ్యారు. 2022లో టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. పోలవరం పనులు వేగంగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నిమ్మల స్పష్టంగా చెప్పారు. 2022లో టెండర్ ఖరారు చేసిన ధరలకే ఇవ్వాలని, ప్రాజెక్టు నిర్మాణం ఒకే సంస్థతో కొనసాగిస్తే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
భారం తగ్గడంతో పాటు పనులు చేపట్టిన ఏజెన్సీకి బాధ్యత ఉంటుంది అని స్పష్టం చేసారు. ఏజెన్సీలను మార్చుతూ పోతే నిర్మాణం ఆలస్యమవుతుంది అని పేర్కొన్నారు. దీనితో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ఆరోపణలు చేసిన సంస్థ ఇప్పుడు ప్రీతిపాత్రం అవ్వడమే ప్రజలు జీర్ణించుకోకున్నారు. ఒకవైపు తెలంగాణాలో భారీ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలతో ఆ ప్రాజెక్టులు పనికిరాకుండా పోయిన విషయం కళ్ళముందు కనిపిస్తుంటే ఇప్పుడు అదే సంస్థను పనులు కొనసాగించమని కోరడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. అసలు ప్రాజెక్ట్ పూర్తవుతుందా.. అయితే దాని నాణ్యత ఎలా ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీన్ని ప్రభుత్వం ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.

