వైసీపీ సోషల్ మీడియా దూకుడుకు టీడీపీ సోషల్ మీడియా బ్రేకులు వేయలేక పోతుందా..? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుంది. నిజానికి టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటంలో కూడా తెలుగుదేశం పార్టీ తర్వాతే ఎవరైనా అనే మాట బాగా వినిపిస్తోంది. కానీ వైసీపీ దూకుడుకు టీడీపీ సోషల్ మీడియా ధీటుగా జవాబు చెప్పలేకపోతుంది. నిజానికి వైసీపీ సోషల్ మీడియాలో పని చేస్తున్న వాళ్లు జగన్ మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉన్నారు. కానీ టీడీపీలో అలాంటి పరిస్థితి ఏ మాత్రం కనిపించటం లేదు.
నిజానికి మీడియాలో మతం, కులం, పార్టీ అభిమానం, విధేయత బాగా ఎక్కువగా కనిపిస్తోంది. 2004 ముందు వరకు మీడియా పరిస్థితి ఒకలా ఉండేది. కానీ 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీడియా పరిస్థితి మారిపోయింది. ఇంకా చెప్పాలంటే.. మీడియాకు విలువ లేకుండా చేశారనే చెప్పాలి. అంతకు ముందు పత్రికలో ఒక పరిశోధనాత్మక కథనం ప్రచురితం అయితే.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విభాగాధిపతులు, మంత్రులు గజగజ వణికిపోయేవారు. ఆఘమేఘాల మీద ప్రభుత్వం చర్యలు చేపట్టేది. కానీ 2004 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ స్వయంగా మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో మంత్రులు, అధికారులు, ఉద్యోగులు బరితెగించారనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వ వ్యతిరేక కథనం వస్తే.. వెంటనే సాక్షి, వార్త వంటి అనుకూల పత్రికల్లో అదంతా అబద్ధం అని ఖండన వార్తలు వచ్చేవి.
Also Read : బెంగళూరు అంకుల్ ఎక్కడ..? సోషల్ మీడియాలో రచ్చ
ఇక సాక్షి మీడియా ప్రారంభమైన తర్వాత కులం, పార్టీ అభిమానం, జగన్ పట్ల విధేయత ఉన్న వారికే అందులో అవకాశం ఇచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలను ఎంత డ్యామేజ్ చేస్తే.. వారికి అంత ప్రోత్సాహం ఇచ్చారు. దీంతో వాళ్లు రెచ్చిపోయారు. జగన్ పట్ల అభిమానం ఉన్నవాళ్లు వైసీపీ సోషల్ మీడియాలో ఉంటే.. టీడీపీలో మాత్రం జీతం కోసం పని చేసే వాళ్లే ఉన్నారు. జగన్ కోసం ఏమైనా చేస్తామనే వాళ్లు వైసీపీ సోషల్ మీడియాలో పని చేస్తుంటే.. టీడీపీ సోషల్ మీడియాలో మాత్రం.. మనకెందుకు వచ్చింది.. ఒకటో తేదీ జీతం వచ్చిందా లేదా అని చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే పార్టీ పట్ల విధేయత కంటే కూడా.. జీతం కోసం పని చేస్తున్నాం అనుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారనేది బహిరంగ రహస్యం.
అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలే సిట్ అధికారులు తాము విచారణ జరిపిన కల్తీ నెయ్యి కుంభకోణం కేసుకు సంబంధించిన రిపోర్టును కోర్టుకు సమర్పించారు. కల్తీ నెయ్యి సరఫరా విషయంలో జరిగిన తప్పులను సిట్ అధికారుల టీమ్ ఇచ్చిన నివేదికను వక్రీకరించి ఎదురు దాడి చేస్తున్న వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలను సమర్ధవంతంగా ఎదుర్కోవటంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సోషల్ మీడియా, నాయకులు ఘోరంగా, దారుణంగా విఫలమయ్యారన్నది నూటికి నూరు శాతం నిజం.
Also Read : తెలంగాణ పుర పోరు షెడ్యూల్ ఇదే.. జనసేన ఓకే.. మరి సైకిల్..?
శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. నిజానికి ఈ వ్యాఖ్యలు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే చేశారు. కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని.. కానీ కల్తీ నెయ్యి ని కొన్ని డైరీలు సరఫరా చేసింది నిజమే అంటూ సిట్ అధికారులు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా ఉంది. అలాగే అసలు పాలు, వెన్నతో తయారు చేసిన నెయ్యి కాదని.. కేవలం కెమికల్ ఆధారంగానే నెయ్యి లాంటి పదార్థం తయారు చేసి టీటీడీకి సరఫరా చేశారని నివేదికలో స్పష్టం చేశారు. అంటే కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు రుజువైంది కదా.
అయితే సిట్ నివేదికను వైసీపీ తనకు అనుకూలంగా మార్చేసింది. కల్తీ నెయ్యి, కెమికల్ మిక్సింగ్ అనే ఊసే ఎత్తకుండా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేసిన జంతువుల కొవ్వు అనే మాట మాత్రమే పట్టుకుని.. దానిపై సోషల్ మీడియాతో పాటు వైసీపీ నాయకులు కూడా సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఈ అబద్ధాలతోనే వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అసలు అది కల్తీ నెయ్యి కాదనే మాటను బాగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దారుణంగా అసత్యాలను వైసీపీ ప్రచారం చేస్తుంటే.. టీడీపీ, జనసేన సోషల్ మీడియాలు మాత్రం నిద్రపోతున్నట్లున్నాయి.
Also Read : వైసీపీపై ప్రజాగ్రహం.. లేదంటే బహిష్కరణే..!
టీడీపీ, జనసేన నాయకులు కుంభకర్ణుని పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో ఏముందో తెలిసి కూడా వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఆ తప్పును సకాలంలో అటు ప్రభుత్వ అధికారులు, ఇటు టీడీపీ, జనసేన పార్టీల నేతలు తిప్పికొట్టటం లేదు. దీంతో అబద్దాలు వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. అసలు ఎలాంటి అవినీతి జరగనట్లు, వైసీపీ చేస్తున్న హడావుడి ఎదుర్కోవటంలో.. టీడీపీ, జనసేన పార్టీల మెతక వైఖరి వల్ల, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరువు, ప్రతిష్టలు మంట కలిసిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

