ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోంది. ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురైన టీడీపీ నేతలంతా పార్టీ అధికారంలోకి రావడంతో హమ్మయ్య అనుకున్నారు. ఇక ఏపీ ప్రజలు కూడా వైసీపీ ఓడినందుకు సంతోషపడ్డారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇందుకు ప్రధాన కారణం.. టీడీపీ ఎమ్మెల్యేలు అనేది బహిరంగ రహస్యం. పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే కొందరు ఎమ్మెల్యేలు బరితెగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఇసుక, మద్యం, శాండ్ వంటి వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు వాటాల పేరుతో వేధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ.
Also Read : అంతా హారీష్ డ్రామా.. మా నాన్న పరువు తీసాడు.. కవిత సంచలనం
తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు చివరికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు చేరాయి. వీటిపై పార్టీ నేతలకు నిర్వహించిన వర్క్ షాపులోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. లిక్కర్ వ్యాపారంలో మీకేం పని అని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు కూడా. ఇక ఏడాది పాలన పూర్తైన సందర్భంగా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు తీరు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయంపై ఇప్పటికే పార్టీతో పాటు పలు సర్వే సంస్థలు కూడా నివేదికలు బయటపెట్టాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 70 మంది రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమని.. ఇందుకు కేవలం వారి పనితీరే కారణమంటూ నివేదికలు వచ్చాయి. ఇక చంద్రబాబు కూడా తీవ్ర ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ నిర్వహించి వార్నింగ్ కూడా ఇచ్చారు.
Also Read : అప్పుడు ఎక్కడ ఉన్నారు సార్..? రామచంద్ర యాదవ్ పై విమర్శలు
అయితే ఇప్పుడు పార్టీతో పాటు కార్యకర్తల్లో కూడా ఓ ప్రశ్న బాగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేల గురించి సర్వేలు చేయిస్తున్నారు.. అలాగే అవినీతి చేస్తున్నారని క్లాస్ కూడా తీసుకుంటున్నారు. అంత వరకు బాగానే ఉంది.. మరి ఎంపీల సంగతి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి చెందిన కొందరు ఎంపీల తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు, భరత్, సీఎం రమేష్, కేశినేని చిన్ని, సానా సతీష్.. ఇలా ఒకరేంటి.. చాలా మందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విషయాల్లో భరత్ వేలు పెడుతున్నారని.. జిల్లాలో గ్రూప్ రాజకీయాలను రామ్మోహన్ ప్రొత్సహిస్తున్నారని.. ఇక ఏ పని కావాలన్నా సరే.. సానా సతీష్ చేయించగలరని.. ఇలా ఒక్కొక్కరిపైన ఒక్కో ఆరోపణ. ఒకరిద్దరు మినహా.. దాదాపు అందరిపైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల గురించి మాత్రమే పదే పదే ప్రస్తావిస్తున్న పార్టీ నేతలు.. ఎంపీల గురించి కూడా పట్టించుకోవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు.