కలియుగ వైకుంఠ నాధుడైన శ్రీనివాసుడి దర్శనార్ధం రాజకీయ, రాజ్యంగ, సినీ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తులు నిత్యం లక్షలాదిగా తిరుమలకు తరలి వస్తుంటారు. దేశం నుంచే కాక విదేశాల నుంచి నిత్యం లక్షకుపైగా భక్తులు తిరుమలకు విచ్చేసి.. స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీవారి సన్నిధి… కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన చాలా సున్నితమైన అంశం. అందుకే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుంది.
వైసీపీ పాలనలో 2019 నుంచి 2024 మధ్య తిరుమలలో జరిగిన పలు ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీసాయి. చేతిలో ఉన్న మొబైల్ కెమెరాతో ఇష్టానుసారం ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆ వీడియోలు భక్తుల మనోభావాలను దెబ్బతీసినా పట్టించుకోలేదు. అందులో బిగ్ బాస్, జానకి కలగనలేదు లాంటి ప్రోగ్రాంల ఫేమ్ ప్రియాంకా జైన్ కూడా ఒకరు. ఆమె ప్రతి అంశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. పైగా తన లవర్‌తో కలిసి ఫ్రాంక్ వీడియోలు కూడా తీస్తుంటారు. నెవర్ ఎండింగ్ టైటిల్‌తో అలాంటి వీడియోలను ప్రియాంక యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారు. 8 నెలల క్రితం ప్రియాంక తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అలిపిరి మార్గంలోని ఏడో మైలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్య భాగంలో చిరుతలు ఎక్కువగా తిరుగుతాయని తెలుసుకుని అదే ప్రాంతంలో ప్రియాంక తన ప్రియుడితో కలిసి రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. అనంతరం తిరుమల నడక దారిలో తమపై చిరుత దాడి చేసిందంటూ షాకింగ్ వీడియోను యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. అదంతా ఫేక్ వీడియో అని జనానికి అర్థమైంది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ప్రియాంక, శివకుమార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దానితో ఆ వీడియోను వాళ్లు డిలీట్ చేశారు. పాత వీడియో కావడంతో టీటీడీ కూడా వారిని సున్నితంగా హెచ్చరించి వదిలేసినట్లు సమాచారం.
Also Read : వెంకట్రామిరెడ్డిని ఉద్యోగులు తరిమి కొట్టారా…?
ప్రియాంక, శివకుమార్ వ్యవహారాన్ని మరువకముందే ఫోటో షూట్ అంటూ మరో అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. నలుగురు ఫోటో గ్రాఫర్లతో ఆలయం ముందు ఓ వ్యక్తి ఫోటోలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఇదేం తంతురా నాయనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఆలయం ముందు ఫోటో షూట్ చేసిన వంశీనాధ్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్దమైంది. వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని శ్రీవారి ఆలయం ముందు తనతో పాటు తీసుకొచ్చిన నలుగురు ఫోటోగ్రాఫర్లతో ఫోటో షూట్ చేశాడని వీడియోల ఆధారంగా టీటీడీ నిర్ధారణకు వచ్చింది. విజిలెన్స్ సిబ్బంది గమనించి ఆలయం ముందు ఫోటో షూట్ చేయకూడదని వారించి అక్కడ నుంచి పంపేసినా… మళ్లీ తిరిగొచ్చి ఫోటో షూట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని తేలింది. ఈ కారణంగా వంశీనాధ్ రెడ్డి పై టీటీడీ నిఘా, భద్రత విభాగం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు ప్రకటించారు.
గతంలో 2022 జూలైలో ప్రముఖ సినీ నటి నయన తార కూడా తన వివాహం తర్వాత భర్త విగ్నేష్‌తో కలిసి శ్రీవారి ఆలయం ముందు ఫోటో షూట్ నిర్వహించారు. ఇంతటితో ఆగకుండా స్వామి వారు విహరించే ఆలయ మాడ వీధుల్లో పాదరక్షలతో తిరిగారు. అప్పట్లో అది తీవ్ర సంచలనంగా మారింది. నయనతారపై తీవ్ర చర్యలకు టీటీడీ సిద్ధం కాగా.. నిబంధనలు తెలియక పొరబాటు జరిగినట్లు ప్రకటించి వాళ్లు క్షమాపణలు చెప్పడంతో వివాదం పరిష్కారమైంది.
Also Read : ఇందిరా గాంధీ పేరే నచ్చదు.. ఫడ్నవీస్ గురించి ఎవరికి తెలియని 5 విషయాలు
తిరుమల్లో అన్యమతానికి సంబంధించిన చిహ్నాలు, వస్తువులు రాకుడదని నిబంధన వున్నప్పటికి భద్రతా వైఫల్యంతో తరుచూ ఏదో ఒక్క ఘటన జరుగుతూనే ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్తితి వస్తోంది. నాలుగు రోజుల క్రితం అన్యమత పదాలు రాసిన ఒక కారు.. అలిపిరి భద్రతా వలయాన్ని దాటుకుని తిరుమల చేరుకుంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో అర్చక నిలయం వద్దే పార్కు చేసినా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఇక ఘాట్ రోడ్డులో కొందరు యువకులు ఆకతాయి చేష్టలకు దిగారు. ఓ వైపు చిరుజల్లులు కురుస్తుండగానే… మరో వైపు కారులో ఉన్న సన్ రూఫ్, డోర్‌కు ఉన్న విండోస్ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ సెల్ఫీలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెనుకగా వచ్చే మరో వాహన చోదకుడు దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసిన టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఆరుగురు యువకులను పట్టుకున్నారు. వారిని తిరుమల టౌన్ పోలీసులకు అప్పగించారు. ప్రయాణంలో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని.. అమితవేగం తగదని… ధార్మిక క్షేత్రంలో విచ్చలవిడిగా ప్రవర్తించడం పద్ధతి కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు.
ఓ అమ్మాయి తిరుమల కొండ వద్ద పుష్ప 2 సినిమాలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేస్తూ వైరల్ అయిపోయింది. తిరుమల కొండ దిగువన ఉన్న ప్రాంతం అలిపిరి టోల్‌గేట్ ముందు డాన్స్ చేసి వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ కావడంతో మన్నించడి మహాప్రభో అంటూ క్షమాపణల వీడియో విడుదల చేసింది. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని భక్తులు మండిపడుతున్నారు.
Also Read : ప్లీజన్నా రండి.. పార్టీ నేతలకు జగన్ రిక్వెస్ట్
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్న వారి పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమలకు వచ్చే భక్తులు, శ్రీవారి వైభవాన్ని పెంచేలా నడుచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఆకతాయి చేష్టలకు వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తోంది. తిరుమలలో స్వామి వారి నామాలు.. వైభవంపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలే తప్ప.. భక్తుల మనోభావాలు దెబ్బతినే వీడియోలు తీయకూడదని విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తోంది.

