ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సీఐడీ తాజాగా కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న మునితుకారాం, ఏ-4 గా ఉన్న మాధవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం వీరికి ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా సీఐడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు.
Also Read : తగ్గని పిన్నెల్లి వాయిస్.. ఈ వార్నింగ్ ఎవరికి..?
ఇది ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదం కాదని, అత్యంత కుట్రపూరితంగా, ప్రణాళికాబద్ధంగా ఫైళ్లను దహనం చేశారని సీఐడీ నిర్ధారించింది. వివాదాస్పద భూములకు సంబంధించిన కీలక పత్రాలు, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని భూ కేటాయింపుల ఫైళ్లను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. బుధవారం జరిగిన విచారణలో నిందితులు సీఐడీ అధికారులకు ఏమాత్రం సహకరించలేదని రిపోర్టులో వెల్లడించారు. అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తూ దర్యాప్తును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు.
Also Read : అమెరికా మంత్రులను భయపెట్టిన డ్రోన్ లు..!
నిందితులు విచారణలో నోరు విప్పకపోవడంతో, వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిందితులను విచారిస్తేనే, ఈ కుట్ర వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు..? ఎవరి ఆదేశాల మేరకు ఫైళ్లను తగులబెట్టారు? అనే విషయాలు బయటకు వస్తాయని సీఐడీ భావిస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదం కాదని, భూ అక్రమాల ఆధారాలను ధ్వంసం చేసేందుకు 7 లీటర్ల ఇంజన్ ఆయిల్ ఉపయోగించి ఫైళ్లను దహనం చేసారని అధికారులు వెల్లడించారు.

