ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి అన్ని శాఖలా.. ఇదే ఇప్పుడు ఏపీ సచివాలయంలో హాట్ టాపిక్. సర్వీస్ నుండి రిటైర్డు అయిన ఐఏఎస్ అధికారుల సర్వీస్ మళ్ళీ పొడిగించే సంప్రదాయాన్ని మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రారంభించగా ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా ఆ సంప్రదాయన్ని పాటిస్తున్నారు. నిజానికి ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఐఏఎస్ అధికారులు సర్వీస్ నుండి రిటైర్డు అయితే వారి సర్వీస్ పొడిగించాలంటే.. కేంద్రం అనుమతి తప్పని సరిగ్గా తీసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో,కేంద్రం అనుమతి తీసుకుంటున్న పాలకులు.. మిగిలిన ఐఏఎస్ అధికారుల సర్వీస్ పొడిగించే విషయంలో నిబంధనలు పాటించటం లేదు.
Also Read : సంచలన నిర్ణయం దిశగా జగన్ అడుగులు..!
ఐఏఎస్ అధికారుల సర్వీస్ పొడిగింపు విషయం తెలిసిన కేంద్రం కూడా ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. సమర్థులు, నిజాయతీ పరులైన ఐఏఎస్ అధికారులు సర్వీస్ నుండి రిటైర్డు అయ్యాక వారిని తిరిగి సర్వీసులో తీసుకోవటం తప్పు కాదు. కానీ వారికి ఏకంగా ఏడెనిమిది శాఖల బాధ్యత అప్పగిస్తే ఎలా..? సమర్థులు, నిజాయతీపరులైన ఐఏఎస్ అధికారులు.. ప్రస్తుతం లేరని, ఉన్న వారు అంత గొప్ప వారు కాదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారా..? నమ్ముతున్నారా..? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు అఖిల భారత సర్వీస్ అధికారుల్లో, సచివాలయ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఐఏఎస్ అధికారుల్లో సమర్థులు, నిజాయతీ పరులకు కొదవ లేదన్నది వాస్తవం. అలాంటి వారి సేవలు వినియోగించుకోవటంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే మాట బాగా వినిపిస్తోంది. అలాంటి వారిని కాదని.. అనేక సంవత్సరాలు పని చేసి.. సర్వీస్ నుండి రిటైర్ అయిన అధికారులకే మళ్లీ మళ్లీ కీలక పోస్టింగ్ ఇస్తున్నారనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. బి.రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి రిటైర్ అయిన తర్వాత ఒక సంవత్సరం సర్వీస్ పొడిగించారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు ఆ పొడిగింపు సర్వీస్ కాలం కూడా పూర్తయ్యింది. మళ్లీ మరో సంవత్సరం సర్వీస్ పొడిగించారు.
Also Read : షర్మిల మౌనం… మార్పుకు సంకేతమా?
ప్రస్తుతం రాజశేఖర్ ఏయే శాఖలను నిర్వహిస్తున్నారో తెలుసా.. అవేమిటో తెలిస్తా ఆశ్చర్యపోవటం ఖాయం. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధన శాఖ, కో ఆపరేటివ్, మార్కెటింగ్, గిడ్డంగులు, మత్య్స శాఖ, ఉద్యానవనాల శాఖ.. మరో కీలక శాఖను కూడా రాజశేఖర్ నిర్వహిస్తున్నారనేది సచివాలయ వర్గాల మాట. నిజానికి ఇద్దరు నిర్వహించాల్సిన శాఖలను సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక కూడా రెండో సంవత్సరం కూడా రాజశేఖర్ నిర్వహిస్తున్నారు. సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక కూడా రాజశేఖర్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వటం పై సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఇది సీనియర్లను అవమానించటం కదా అని అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం.. కావాలంటే రాజశేఖర్ ను పేషీలోనో లేక సలహాదారునిగా నియమించుకోవాలి.. కానీ ఇలా సర్వీస్‌లో ఉన్న అధికారులు నిర్వహించాల్సిన శాఖలను రిటైర్డు ఐఏఎస్ అధికారి నిర్వహించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాజశేఖర్ నిర్వహిస్తున్న శాఖల్లో సగం శాఖలను తప్పించి సర్వీసులో ఉన్న వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారం అనుభవం లేని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెరతీసిన కొత్త సంప్రదాయాన్ని.. అపార అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఎందుకు పాటిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి చంద్రబాబు పనితీరుపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఎలాంటి అధికారితో అయినా సరే.. ఆయన మెరుగైన ఫలితాలు రాబట్టగలరు. అలాంటి చంద్రబాబు.. రిటైర్డ్ అధికారులను ఎందుకు పొడిగిస్తున్నారనేది కీలక ప్రశ్న.
Also Read : కవిత–పీకే భేటీ: తెలంగాణ రాజకీయాల్లో నూతన శకం
నిజానికి సర్వీసులో ఉండే ఐఏఎస్ అధికారి మాత్రమే నిర్వహించాల్సిన ఫిషరీష్ శాఖ కమీషనర్ పోస్టులో కూడా రిటైర్డు అయ్యి ఏళ్లు గడిచినా కూడా నాయక్ అనే రిటైర్డు ఐఏఎస్ అధికారిని కమీషనర్‌గా నియమించారు చంద్రబాబు. ఈ నియామకం ముమ్మాటికీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నిస్తే.. న్యాయపరమైన చిక్కులు తప్పవు. మరి ఇలాంటి కొత్త సంస్కృతిని సీఎం చంద్రబాబు పోషించటం దురదృష్టకరం. పొరపాటులు, తప్పులు సీఎం చంద్రబాబు సరిచేయకుంటే భవిష్యత్తులో అందుకు మూల్యం చెల్లించక తప్పదనేది రాజకీయ విశ్లేషకుల మాట.

