మరో 18 నెలల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తా అంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ఇప్పుడు రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి పాదయాత్ర చేస్తా అనే ప్రకటనపై ఎవరూ ఆశ్చర్యం వ్యక్తం చేయటం లేదు. ఎందుకంటే.. పాదయాత్ర అనేది జగన్‌కు అలవాటే. ఇంకా చెప్పాలంటే.. అధికారంలోకి వచ్చేందుకు, అధికారం కోసం వైఎస్ కుటుంబం ఎంచుకున్న ఏకైక అస్త్రం పాదయాత్ర. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు ఓడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత జగన్ ఓదార్పు యాత్ర, చెల్లి షర్మిల పాదయాత్ర, తర్వాత జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.
Also Read : అంతా హరీష్ మాయ.. కేటీఆర్ మసకబారుతున్నారా..?
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తారని తొలి నుంచి వైసీపీ నేతలే చెబుతున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో.. జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు మకాం మార్చేశారు. అయితే సొంత పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడం, సాయిరెడ్డి లాంటి అత్యంత సన్నిహితులు కూడా జగన్‌కు గుడ్ బై చెప్పడంతో.. మళ్లీ తాడేపల్లి ప్యాలెస్‌కు రావడం మొదలుపెట్టారు జగన్. ఓ వైపు కూటమి సర్కార్ చేస్తున్న అభివృద్ధి.. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేసుల విచారణ నేపథ్యంలో జగన్ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతుంది.
రాజకీయాల్లో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించిన జగన్.. తిరిగి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరో 18 నెలల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తా అన్నారు. ఈ ప్రకటన ఇప్పుడు సొంత పార్టీ నేతల్లోనే ఆందోళన కలిగిస్తోంది. 2018లో జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఖర్చు అటు పార్టీ, ఇటు ఆయా నియోజకవర్గ నేతలు పెట్టుకున్నారు. అప్పుడు అంత భారం అనిపించలేదు కూడా. కారణం.. టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతలకు కూడా పనులు జరిగాయి. బిల్లుల చెల్లింపులో వివక్ష చూపించలేదు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలకు కూడా చుక్కలు చూపించారు జగన్. కనీసం రూపాయి కూడా సంపాదించుకోలేదనేది పార్టీ నేతల మాట.
Also Read : చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారా..?
జగన్ పాదయాత్ర అంటే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రతి నియోజకవర్గంలో కనీసం పదిరోజులు ఉండేలా రూట్ మ్యాప్ ఉంటుంది. ప్రతి జిల్లాలో కనీసం నెల రోజులు సాగాలనేది జగన్ ఆర్డర్. ఈ నెల రోజుల పాటు ఖర్చు, బహిరంగ సభల నిర్వహణ, కార్యకర్తల మంచి చెడు, ఇప్పుడు కొత్తగా రప్పా రప్పా బ్యాచ్‌కు ప్రత్యేక ఖర్చు.. ఇవన్నీ తలుచుకుని మా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు సొంత పార్టీ నేతలు. తీరా ఇంతా ఖర్చు చేస్తే.. ఎన్నికల్లో టికెట్ వస్తుందనే నమ్మకం లేదంటున్నారు. అందుకే పాదయాత్ర అంటే.. ఆమడ దూరం పారిపోతున్నారు వైసీపీ నేతలు.

