దమ్ముంటే టచ్ చేసి చూడు.. అని సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరో మహేశ్ బాబు గురించి విలన్ ప్రకాష్ రాజ్‌తో విజయశాంతి సవాల్ విసురుతారు. ఇప్పుడు అదే సవాల్ సైబరాబాద్ పోలీసులకు సినీ పైరసీ సైట్లు విసురుతున్నాయి. ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్‌ల నిర్వాహకుడు ఇమ్మంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రవి అరెస్టు తర్వాత టాలీవుడ్ పెద్దలంతా కలిసి కమిషనర్ సజ్జనార్‌తో ప్రెస్ ముందుకు వచ్చారు కూడా. కింగ్ పిన్ అరెస్టు తర్వాత పైరసీ తగ్గుతుందని అంతా భావించారు. ఇక రవి అరెస్టు పై మిశ్రమ స్పందన కూడా వచ్చింది.
Also Read : బ్రేకింగ్: అనర్హతపై స్పీకర్ సంచలన తీర్పు..!
ఐ బొమ్మ రవి అరెస్టు తర్వాత పైరసీ ఆగిపోతుందని అప్పట్లో తెగ ప్రచారం చేశారు. రవిపై పోలీసులు కూడా వేరు వేరుగా 4 కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ఇప్పుడు రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం 21 వేల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసు కస్టడీలో రవి అంగీకరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇకపై పైరసీ చేయడం ఆపేస్తానని.. తన దగ్గర ఉన్న డబ్బులతో బయటకు వచ్చిన తర్వాత హోటల్ ఏర్పాటు చేస్తానని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఇక పైరసీకి బ్రేకులే అని అంతా అనుకున్నారు.
కానీ రవి అరెస్టు తర్వాత కూడా సినిమాలు పైరసీ జరుగుతూనే ఉన్నాయి. నిజానికి రవి ఏ సినిమాను పైరసీ చేయలేదు. ఓటీటీలో వచ్చిన సినిమాలను మాత్రమే డీఆర్ఎం టెక్నాలజీ సాయంతో స్క్రీన్ రికార్డ్ చేసి.. దానిని అలాగే ఐ బొమ్మ, బప్పం సైట్‌లలో అప్ లోడ్ చేశాడు. వాటిని కూడా కొద్ది రోజులకు డిలీట్ చేశాడు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ కెమెరాల ద్వారా, థియేటర్ల సాఫ్ట్ వేర్ హ్యాక్ చేయడం ద్వారా కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే వెబ్ సైట్‌లో పెడుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా నాలుగైదు వెబ్ సైట్లు పని చేస్తున్నాయి. వాటి మూలాలు గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారనేది వాస్తవం.
Also Read : పవన్ సూపర్.. భయపడేది లేదు: చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
రవి అరెస్టు అయిన వెంటనే.. పైరసీ ఆగిపోయిందన్నట్లుగా అంతా సంబరాలు జరుపుకున్నారు కూడా. కానీ ఐ బొమ్మ రవి అరెస్టుతో పోలీసులు సాధించేది ఏమీ లేదని తేలిపోతోంది. ఇటీవల రిలీజ్ అయిన అఖండ 2 మొదలు దాదాపు అన్ని సినిమాల పైరసీలు వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏ డొమైన్ నుంచి అప్ లోడ్ అయ్యాయో కనుక్కోవడం పోలీసుల వల్ల కావటం లేదు. అసలు పైరసీ కింగులెవరనే విషయం కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. నిజానికి రవి వల్ల నష్టపోయింది నిర్మాతలు కాదు.. కేవలం ఓటీటీ సంస్థలు మాత్రమే. కానీ.. పైరసీ వెబ్ సైట్ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. పైరసీ చేస్తున్న వారి వల్లే భారీగా నష్టం జరుగుతుంది. మరి పోలీసులు అసలైన కింగ్ పిన్‌లను పట్టుకుంటారా? నిజంగా పైరసీకి బ్రేక్ వేస్తారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.

