రాజకీయాల్లో మరో నందమూరి వారసురాలు తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు రాజకీయ వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ ఉన్నారు. ఇక ఇద్దరు అల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, నారా చంద్రబాబు నాయుడు కూడా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా కొనసాగుతున్నారు. వీరితో పాటు మనవడు నారా లోకేష్ మంత్రిగా, బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ విశాఖ ఎంపీగా రాజకీయాల్లోనే ఉన్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. అయితే దానికి ఇంకా సమయం ఉందనేది ఆయన సన్నిహితుల మాట. ఇదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి మరో మహిళ కూడా చట్టసభకు ఎన్నికయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read : చెవిరెడ్డి లీగల్ బ్రెయిన్.. సిట్ షాక్..!
తెలంగాణలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక కూడా జరగనుంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్మరణం చెందితే ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగకుండా.. ఆ నేతపై అభిమానంతో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే.. ఏకగ్రీవం చేసుకోవడం ఆనవాయితీ. కానీ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు పోటీ చేసే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
సిట్టింగ్ స్థానాన్ని వదులుకునేందుకు బీఆర్ఎస్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు కాకుండా మరో వ్యక్తిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా నియోజకవర్గంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్ కూడా జూబ్లీహిల్స్ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, వివేక్, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురు మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాడింది. 2014 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసిన గోపీనాథ్.. గెలిచిన తర్వాత బీఆర్ఎస్లో చేరిపోయారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు.
Also Read : లోకేష్ భయంతోనే వైసీపీ నేతలు పారిపోతున్నారా..?
ఈ ఏడాది అక్టోబర్‌లోపు ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ఇప్పటికే దృష్టి పెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, నవీన్ యాదవ్‌తో పాటు మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ఇస్తే.. అజారుద్దీన్ పేరు ఖరారు అవుతుంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో తమ సంఖ్య పెంచుకునేలా అడుగులు వేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ, టీడీపీ కూడా దృష్టి పెట్టాయి. జనసేన పార్టీ కూడా కూటమిలోనే కొనసాగుతుండటంతో 3 పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి ఏ మాత్రం పట్టులేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి ఎన్నికల్లో కూడా 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. దీంతో మరోసారి తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. టీడీపీ తరఫున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దింపాలని పార్టీ భావిస్తోంది. గతం కూకట్పల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిన సుహాసిని.. హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల మహానాడు వేదికపై కూడా సుహాసిని కనిపించారు. సుహాసినిని బరిలో నిలిపితే.. సానుభూతి ఓట్లు కూడా వస్తాయనేది టీడీపీ నేతల ప్లాన్. ప్రస్తుతం సుహాసిని అభ్యర్థిత్వంపై 3 పార్టీల నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే దీపక్ రెడ్డిని బుజ్జగించడం ద్వారా సుహాసినికి లైన్ క్లియర్ చేద్దామనేది టీడీపీ ప్లాన్.

