కూటమిలో కుంపటి రాజేశారు. తొలి నుంచి అంతా భావిస్తున్నట్లుగానే లోకల్ వార్లో సీట్లు, టికెట్ల కేటాయింపు తర్వాత అసమ్మతి మొదలైంది. అలాగే టికెట్లు, పదవులు ఆశించిన వారు ఇప్పుడు రెబల్స్గా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఓ రెబల్ అభ్యర్థికి కూటమి ఎమ్మెల్యే మద్దతుగా నిలవటం హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రెబల్ను ఎంకరేజ్ చేస్తూ.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చివరికి రెబల్ అభ్యర్థికి మద్దతుగా కొలికిపూడి స్టేటస్ పెట్టడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.
Also Read : రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్ గ్యాంగ్..!
కూటమి మధ్య సీట్ల ఒప్పందంలో భాగంగా తిరువూరు మునిసిపల్ చైర్మన్ టికెట్ జనసేన పార్టీకి కేటాయించారు. జనసేన పార్టీ తరఫున పి.మాధవి పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో జనసేన పార్టీ నేతలు, శ్రేణులు, మాధవి అనుచరులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు తమ నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ సహా.. తిరువూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలను పి.మాధవి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే తన గెలుపునకు సహకరించాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
Also Read : హోం మంత్రి పదవి పై అంబటి కర్చీఫ్
పి.మాధవి జనసేన పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో.. కొలికపూడి పెట్టిన వాట్సప్ స్టేటస్ పెద్ద దుమారం రేపుతోంది. తిరువూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా పెనుబల్లి శ్రావణి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలంటూ కొలికిపూడి స్టేటస్ పెట్టారు. ఓ వైపు కూటమి అభ్యర్థిగా మాధవి నామినేషన్ వేసేందుకు రెడీ అవుతుంటే.. పెనుబల్లి శ్రావణి నామినేషన్ ర్యాలీకి రావాలని కోరడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. కొలికపూడి ఎమ్మెల్యేగా గెలవటంలో జనసేన పార్టీ నేతలు కూడా కీలకంగా వ్యవహరించారు. అయినా సరే.. ఇప్పుడు జనసేన నేతలకు సహకరించకుండా.. ఇలా రెబల్ అభ్యర్థి ర్యాలీకి రావాలని కోరడమేమిటని నిలదీస్తున్నారు.
Also Read : సాక్ష్యాలతో కడిగిపారేసిన ఈడీ.. అవినాష్ కన్నీరు
తొలి నుంచి కొలికపూడి వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని పెత్తనం చేస్తున్నారని.. అలాగే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని కొలికపూడి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కొలికపూడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పెద్దలు.. ఇప్పటికే మూడుసార్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకసారి టీడీపీ క్రమశిక్షణ కమిటి ముందు హాజరయ్యారు. వివరణ ఇచ్చుకున్నారు. మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటా.. అని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూటమి ఒప్పందానికి వ్యతిరేకంగా.. ఇలా రెబల్ అభ్యర్థికి సహకరించడం ఏమిటనేది హాట్ టాపిక్.


