వైసీపీ నేతల ఇళ్లపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. మొన్న అంబటి రాంబాబు.. నిన్న జోగి రమేశ్.. దీంతో ఏపీలోని వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అందరు ఇళ్ల దగ్గర కాదు.. ఎవరైతే బూతులతో రెచ్చిపోతున్నారో.. తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారో.. ఆ నేతల ఇళ్ల దగ్గర మాత్రమే పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేశారు. పేర్ని నాని, దేవినేని అవినాష్, రోజా వంటి నేతల ఇళ్ల వైపు ఎవరు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆయా నేతల ఇళ్ల వైపు ఎవరైనా అనుమానాస్పదంగా వస్తే.. ముందుగానే ఆపుతున్నారు. అలాగే టీడీపీ శ్రేణులు అటు వస్తే చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు కూడా. పోలీసులు ఇలా రక్షణ చర్యలు తీసుకోవడం వెనుక ప్రధాన కారణం.. టీడీపీ నేతలు, కార్యకర్తల తెగింపు మాత్రమే. నిజానికి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అనే పేరు. ఎదుటి పార్టీ వారిపై రాజకీయ విమర్శలు చేయడం తప్ప.. ఇంతవరకు వ్యక్తిగత దూషణలు, దాడులకు టీడీపీ నేతలు దిగలేదు. ఒకరిద్దరు అలా చేస్తే.. అలాంటి వారిపై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. ఇలా మరొకరు చేయకూడదంటూ హెచ్చరించారు కూడా.
Also Read : వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. క్యాడర్ కి బాబు దిశానిర్దేశం
అయితే టీడీపీ నేతలు ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు ఇలా దాడులు చేస్తున్నారు..? వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి.. మనమేం చేసినా నడుస్తుందనే ధీమాతో ఇలా దాడులు చేస్తున్నారా..? లేదంటే.. ఏమైనా సరే.. వెనక నేనున్నా అని అధినేత చంద్రబాబు, కార్యదర్శి నారా లోకేష్ హామీ ఏమైనా ఇచ్చారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి దాడులను అధినేత చంద్రబాబు ఎప్పుడు ప్రోత్సహించలేదు. అందుకే హైదరాబాద్‌లో ఉన్నా కూడా జోగి రమేశ్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. మైలవరం టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని.. ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు సహించేది లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదన్న చంద్రబాబు.. చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న సీఎం చంద్రబాబు.. ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అంటే.. దాడి చేసిన వారిపై కేసులు ఖాయం.
అయితే టీడీపీ నేతల దాడుల వెనుక అసలు కారణం ఏమిటి అంటే.. వైసీపీ నేతల బూతులే అందుకు ప్రధాన కారణం. ఓర్పు నశిస్తే.. పిల్లి పులిగా మారుతుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల పరిస్థితి కూడా ఇదే. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను బూతులు తిడుతూ ఉంటే.. అసభ్య పదజాలంతో నోటి కొచ్చినట్లు అంటుంటే.. ఎవరు మాత్రం ఎంత కాలం అని ఊరుకుంటారు. అందుకే ఇప్పుడు తిరగబడ్డారు. అంబటి, జోగి ఇళ్ల పై దాడి చేశారు. ఇది మిగిలిన నాయకులకు వార్నింగ్ లాంటిది. అయితే ఇక్కడే వైసీపీ నేతల గేమ్ ప్లాన్ మొదలైంది. చంద్రబాబు, పవన్‌ను తిడుతున్నప్పుడు వారికి కులం కనిపించలేదు.. కానీ.. అలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటే మాత్రం.. కులం కుంపట్లు రాజేస్తున్నారు. చివరికి అవుట్ డేటెడ్ పొలిటిషన్ ముద్రగడ పద్మనాభ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఓపికతో బయటకు వచ్చి.. చంద్రబాబు పాలన.. రాక్షస పాలనలో దహనకాండ… ఏపీలో ఏమర్జెన్సీ పెట్టాలి.. కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు.. అంటూ పెద్ద పెద్ద లేఖలు రాస్తున్నారు.
Also Read : రంగా స్థాయిని దిగజారుస్తున్నారా..?
చంద్రబాబు, పవన్‌ను తిట్టినప్పుడు రాని కులం.. అరెస్టు చేయగానే వస్తుందా.. అనేది ఇప్పుడు పెద్ద అనుమానం. నిజానికి టీడీపీ, జనసేన అభిమానులు ఎంతో ఓర్పు వహించారు. అధినేతల ఆదేశాలు పాటించారు. మౌనంగా భరించారు. నాయకులు తమ కాళ్లకు వేసిన సంకెళ్లను భారంగా కాకుండా.. బాధ్యతగా భావించారు. కానీ ఓపిన నశించింది. ఇక అంతే.. తమ సంకెళ్లు తెంచుకున్నారు. కడుపు మండింది.. అధికారంలో లేనప్పుడు భయాలతో భరించి, మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నాం.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి ఎదురవుతున్నా కూడా.. నాయకుల ఆదేశాలతో ఇప్పటి వరకు మౌనంగా భరించాం.. ఓర్చుకున్నాం.. పదే పదే మా నాయకులను అవమానిస్తున్నారు. మళ్ళీ దాడులు చేస్తామంటున్నారు.. అందుకే తెగించారు. అటో ఇటో తేల్చుకోవాలని ఎదురు తిరిగారు. కన్నుకు కన్ను.. పన్నుకు పన్ను అన్నట్లుగా దెబ్బకు దెబ్బ తీయాలనుకున్నారు. తాము అభిమానించే నాయకులను నోటికొచ్చినట్లు బూతులు తిడితే ఎందుకు ఊరుకుంటారనేది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.
అయితే ఇక్కడే వైసీపీ నేతల గేమ్ ప్లాన్ మొదలైంది. వాళ్లు తిడుతుంటే.. కులాన్ని తిట్టినట్లుగా బెదిరిస్తున్నారు. అంబటి రాంబాబు గురించి ఏమో.. కాపు నాయకుడిపై దాడి అని.. జోగి రమేశ్ గురించి ఏమో.. బీసీ నాయకుడిపై దాడి అని కులం ప్రస్తావన చేస్తున్నారు. మరి వాళ్లు తిట్టిన తిట్ల గురించి ఏమిటీ అంటే.. నో ఆన్సర్. అందుకే ఇంకెన్నాళ్లు కులం పేరుతో బెదిరిస్తారు.. ఇంకెన్నాళ్లు భయపడాలి.. అది కూడా అధికారంలో ఉండగా.. నాయకులను తిడితే పట్టించుకోకుండా ఉండాలా.. మేము పార్టీ అభిమానులం, మాకు రోషం, పౌరుషం ఉన్నాయంటున్నారు. సమయం వచ్చింది.. ఇంకెవరి మాట వినం.. అందుకే తిరగబడుతున్నాం అని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతున్నారు. చంద్రబాబు, పవన్‌ను తిట్టడం.. తిరిగి వారిని ఏమైనా అంటే.. మా కులాన్ని తిడుతున్నారు.. కులంపై దాడి చేస్తున్నారు.. అంటూ ఎదురు దాడి చేస్తున్నారు వైసీపీ నేతలు.
Also Read : వైవీ సుబ్బారెడ్డి గారు.. ఈ ప్రశ్నలకు జవాబేది సార్..!
నిజానికి వైసీపీ కాపు నేతలంతా ఘోరంగా ఓడిపోయారు. అంటే.. కాపులు ఒక్కరు కూడా వైసీపీ వెంట లేరు. ఆ విషయం తెలిసి కూడా వారికి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. మళ్లీ మళ్లీ కులాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు చేస్తున్నారు. కల్తీ నెయ్యిలో అడ్డంగా దొరికిన తర్వాత ఇప్పుడు బూతులతో రెచ్చగొట్టి.. దాడులు జరిగేలా ప్రేరేపిస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన నేతలు కూడా ధీటుగానే జవాబిస్తున్నారు. ఎక్కడా కులాల ప్రస్తావన చేయటం లేదు. అధికారంలో ఉన్న నాయకుల మెతక తనాన్ని, చేతకానితనంగా వైసీపీ నేతలు భావిస్తున్నారని.. అందుకే ఎదురు తిరుగుతున్నామంటున్నారు. ఇక సహించేది లేదంటున్నారు. కేవలం ఐదారుగురు వైసీపీ నాయకులే కులాన్ని అడ్డు పెట్టుకొని రెచ్చిపోతున్నారని రాజకీయ పరిశీలకులు, సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఐదారుగురి బరి తెగింపు వెనుక జగన్ రెడ్డి ఆశీస్సులున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

