Wednesday, February 4, 2026 11:10 AM
Wednesday, February 4, 2026 11:10 AM

రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ.. మరీ ఇంత బరితెగింపా..!

గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో పెత్తనం చేస్తాడు.. ఇంకా చెప్పాలంటే గిరిజనుల్ని బెదిరించి, భయపెట్టి రాజకీయాలు చేస్తాడు. ఆ గిరిజన రిజర్వుడు నియోజకవర్గంలో నా మాటే శాసనం అన్నట్లుగా చెలరేగిపోతాడు. ఆయన మాట కాదని ఎవరైన ఎదురు తిరిగితే.. వారిని నేరుగా పై లోకాలకే పంపిస్తాడు. ఇంకా చెప్పాలంటే.. తన ఆంతరంగిక రహస్యాలు తెలుసుకున్న సొంత దళిత డ్రైవర్‌ను హత్య చేసి.. శవాన్ని నేరుగా అతని ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఘనుడు. అతను ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఆయన మరెవరో కాదు.. వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్.. అలియాస్ అనంత బాబు. వైసీపీ తరఫున పెద్దల సభలో తిష్ఠ వేసిన ఓ హంతకుడు. ఈ మాట మేము చెప్పటం లేదు. తన వద్ద పని చేస్తున్న సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్‌ను హత్య చేసి తన కారులో తానే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్లి.. డ్రైవర్ కుటుంబానికి అప్పగించినట్లు అనంతబాబు స్వయంగా పోలీసుల ముందు అంగీకరించాడు. ఈ హత్య కేసులో అనంతబాబును పోలీసులు అరెస్టు కూడా చేశారు.

Also Read : సినిమా రేటింగ్‌లో అక్రమాలు..!

నిజానికి అనంతబాబు నేరచరిత్ర చెబితే చాట భారతం అవుతుంది. విశాఖ ఏజెన్సీలో రంగురాళ్ల తరలింపులో అనంతబాబు ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ ఏజెన్సీలో మహిళల పట్ల అనుచితంగా ప్రవరిస్తున్నారని అనంతబాబుపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దాడి చేసినట్లు అనంతబాబుపై అభియోగాలు ఉన్నాయి కూడా. ఇక గిరిజనులను భయపెట్టి వారితో గంజాయి సాగు, అక్రమ రవాణా చేయిస్తారనేది ప్రధాన ఆరోపణ. అనంతబాబు తండ్రి అనంత చక్రరావు. ఆయన అడ్డతీగర పంచాయతీ మాజీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ సమయంలోనే గిరిజనులపై దాడులకు తెగబడ్డారనే ఆరోపణలు. అందుకే 1986లో చక్రరావును పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్చి చంపినట్లు తెలుస్తోంది. అయినా సరే.. అనంతబాబు తీరులో ఎలాంటి మార్పు లేదు. రంపచోడవరం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం అయినప్పటికీ.. అక్కడ అనంతబాబు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. తాను చెప్పిన వారికే అక్కడ ఎమ్మెల్యే టికెట్. గెలిచిన అభ్యర్థి తన కంట్రోల్‌లోనే ఉండాలి. అలా మాట విననందుకే 2014లో గెలిచిన వంతల రాజేశ్వరిని తీవ్రంగా వేధించారు అనంతబాబు. ఆ వేధింపులు భరించలేక రాజేశ్వరి.. వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

Also Read : ఏపీ రియల్ రంగానికి బూస్ట్..? మారుతోన్న పరిస్థితి..!

2019లో వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి తరఫున ప్రచారం చేసిన అనంతబాబు.. ఎన్నికల్లో ధనలక్ష్మి గెలిచిన తర్వాత నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. పేరుకే కాకినాడ వాసి అయినప్పటికీ.. రంపచోడవరం ఏజెన్సీలో చీమ చిటుక్కు మనాలన్నా సరే.. అనంతబాబు పర్మిషన్ తీసుకోవాల్సిందే అనే హుకుం జారీ చేశారు. ఏజెన్సీలో గిరిజనులపై దాష్ఠికం, అంగన్ వాడీ కేంద్రాల్లో మహిళలపై దాడులు, మహిళా ఉద్యోగులపై లైగింక వేధింపులు, ఉద్యోగుల బదిలీలు.. ఇలా ఒకటేమిటి.. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే.. భౌతిక దాడులకు కూడా అనంతబాబు తెగబడిన సందర్భాలున్నాయి. ఎవరైనా అనంతబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే.. ఆ కేసు నమోదు చేయాలా.. వద్దా అనే విషయం కూడా అనంతబాబు అనుమతి తీసుకున్నారు నాటి జగన్ సర్కార్‌లో ఉన్న పోలీసులు. ఇక తన ఆంతరంగిక విషయాలు తెలుసుకున్నాడనే అక్కసుతో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా కొట్టి.. హత్య చేసిన అనంతబాబు.. తన కారులోనే శవాన్ని నేరుగా డోర్ డెలివరీ చేశాడంటే.. అనంతబాబు అరాచకాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అనంతబాబు అరెస్టు అయిన తర్వాత నాటి ప్రతిపక్షాలో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో.. అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నాటి వైసీపీ పెద్దలు ప్రకటించారు. కానీ.. జిల్లాలో జగన్ పర్యటనలు అయినా సరే.. పార్టీ సమావేశాలైన సరే.. చివరికి బెయిల్ పైన అనంతబాబు విడుదలైన సందర్భంలో కూడా.. అతని చుట్టూ ఉన్న వైసీపీ నేతలు, కార్యకర్తలే. తాడేపల్లి ప్యాలెస్‌లో నిర్వహించే పార్టీ సమావేశాల్లో అనంతబాబు ఇప్పటికీ పాల్గొంటూనే ఉన్నారు. అంటే సస్పెన్షన్ వేటు అనేది.. కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యిందనే విషయం ఇట్టే అర్థమవుతుంది.

Also Read : విషం కక్కిన నా అన్వేషణ.. తెలుగు వాళ్ళ రివేంజ్ వేరే లెవెల్

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. అయినా సరే.. ఇప్పటికీ ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనే కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణ అనంతబాబు వ్యవహార శైలి. నిజానికి శవం డోర్ డెలివరీ కేసులో బెయిల్ పైన ఉన్న అనంతబాబుపైన నేరం రుజువు చేయడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనే మాట బాగా వినిపిస్తోంది. ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదనే మాట ఇప్పుడు కూటమి నేతలే అంటున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యేపైన అనంతబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఓ సాధారణ అంగన్‌వాడీ టీచర్. ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. అలాంటి మహిళకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై పోటీ చేసిన శిరీషాదేవి 10 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇందుకు ప్రధాన కారణం అనంతబాబుపై రంపచోడవరం ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో అభివృద్ధిపైనే శిరీషాదేవి దృష్టి పెట్టారు. అలాగే అనంతబాబు గతంలో చేసిన అక్రమాలను బయటకు తీస్తున్నారు. ఇవి అనంతబాబుకు ఏ మాత్రం రుచించలేదు. వైసీపీ హయాంలో పట్టణ.. మైదాన ప్రాంతాల్లో అవినీతి సొమ్ముతో కొన్న భూముల వివరాల్ని త్వరలోనే బయటపెడతానంటూ టీడీపీ ఎమ్మెల్యే శిరీషా దేవి చేసిన వ్యాఖ్యలు తన అవినీతిని ఎక్కడ బయటపెడతాయో అని భయపడిన అనంతబాబు.. గిరిజన మహిళా ఎమ్మెల్యే శిరీషాదేవిపై రెచ్చిపోయారు.

Also Read : ఇంత ధీమాతో ఎలా ఉన్నారు ధర్మారెడ్డి గారు..?

ఇన్ని రోజులు నియోజకవర్గం మొత్తం తన కంట్రోల్‌లో పెట్టుకున్న అనంతబాబు.. ఎక్కడ తన గ్రిప్ జారిపోతుందో అనే భయంతో.. టీడీపీ మహిళా ఎమ్మెల్యే శిరీషా దేవిని చంపేస్తా అంటూ బెదిరించేందుకు కూడా వెనుకాడ లేదు. తాను కనుసైగ చేస్తే ఆమె చంపేస్తారన్నట్లుగా బెదిరించాడు అనంతబాబు. అమెరికాలో ఉండి కనుసైగ చేస్తే ఎగిరిపోతావంటూ గిరిజన మహిళా ఎమ్మెల్యే శిరీషాదేవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అనంతబాబు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతబాబు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శిరీషాదేవి ఘాటుగా బదులిచ్చారు. నేనేమైనా గాలిలో కొట్టుకుపోయే దూదినా.. మీ కనుసైగలకు భయపడటానికి నేను సిద్ధంగా లేనని .. అవినీతి అక్రమాలన్నీ బయటపెడతానంటూ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తాను సామాన్య అంగన్‌వాడీ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని శిరీషా దేవి గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే తనను ఇలాంటి బెదిరింపులు ఏమీ చేయలేవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఏజెన్సీలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు కాలం చెల్లిందని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

Also Read : రాజు గారు.. కాస్త దూకుడు తగ్గించండి సార్..!

అయితే ఇక్కడే ఓ విషయం మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. అనంతబాబు డోర్ డెలివరీ కేసులో పునర్విచారణ చేయడానికి సిట్ నియమించారు. కానీ.. ఆ సిట్ పని ప్రారంభించిందో లేదో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని.. హత్యకు గురైన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్రావు ఎన్నోసార్లు డిమాండ్ చేశారు కూడా. అయినా సరే.. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు లేదు. అందుకే అనంతబాబు మళ్లీ బెదిరింపులకు దిగుతున్నారనే విషయం స్పష్టం అవుతోంది. వీటితో పాటు మరో విషయం కూడా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ప్రస్తుత జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు స్వయాన మేనల్లుడు. జ్యోతుల నెహ్రూకు సోదరిని అనంతబాబు తండ్రి చక్రరావు వివాహం చేసుకున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైతం అనంతబాబుకు మేనమామే అవుతారు. ఇటు జ్యోతుల నెహ్రూ అటు వరుపుల సుబ్బారావులకు ముద్దుల మేనల్లుడు అనంతబాబు. అందుకే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనంతబాబు ఏం చేసినా.. ఎవరూ అడ్డు చెప్పే ధైర్యం చేయరు. తాజాగా జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్‌కు కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయించారు. ఇది కూడా అనంతబాబు అరాచకాలకు ఓ కారణమనే చెప్పాలి. ఇద్దరు మేనమామలు, సొంత బావ కూడా రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతుండటంతో.. అనంతబాబు అరాచకాలకు అడ్డు లేకుండా ఉందనే మాట బాగా వినిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేను చంపేస్తా అంటూ పరోక్షంగా బెదిరించినప్పటికీ.. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కనీసం స్పందించకపోవటాన్ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్