ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నుంచి విజయానంద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఐఏఎస్ అధికారిగా విజయానంద్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పరిపాలనలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
Also Read : భారత్ పై అమెరికా సంచలన ప్రకటన..!
2025 నవంబర్‌లోనే ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ కారణంగా మరో మూడు నెలల పొడిగింపు లభించింది. ఆ పొడిగింపు ఈ నెలాఖరు నాటికి పూర్తి అవుతోంది. దీంతో ఆయన తప్పని సరిగా పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేసిన వెంటనే ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
విజయానంద్‌కు ఇంధన శాఖ పూర్తి బాధ్యతను, బహుశా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోను కూడా ఒకేసారి అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఆసక్తికరంగా, వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలో జగన్ వ్యవహరించారు. మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డి పదవీ విరమణ చేసిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనను ముఖ్య సలహాదారుగా నియమించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయానంద్ పదవీ విరమణ తర్వాత మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పాత్రను చేపట్టే అవకాశం ఉంది. ఆయన దాదాపు ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఆయనను విద్యుత్ నియంత్రణ కమిషన్.. ఈఆర్‌సీ చైర్మన్ లేదా ఇలాంటి కీలకమైన మరో ముఖ్యమైన పదవి కేటాయించే అవకాశం ఉందని సచివాలయ వర్గాల మాట.
Also Read : అందరికీ తలో రోగం.. అంతా రోగిష్టులే.!
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్ అధికారి ముద్దాడ రవిచంద్రను తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయి కార్యనిర్వాహక అధికారి.. ఈవోగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం, రవిచంద్ర ద్వంద్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా.. టీటీడీ ఈఓగా అదనపు బాధ్యతను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆ బాధ్యతను ఇటీవలే రవిచంద్రకు అప్పగించారు. త్వరలో ఆయనకు శాశ్వత ప్రాతిపదికన ప్రతిష్టాత్మక ఆలయ పరిపాలన బాధ్యతలను పూర్తి స్థాయిలో అప్పగించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విజయానంద్‌కు చంద్రబాబు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారనే అనుమానం మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

