గత కొన్నాళ్ళుగా ప్రశాంతంగా ఉన్న భారత్, పాక్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 1న, పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి గస్తీ తిరుగుతుండగా కృష్ణ ఘాటి సెక్టార్‌లో ఒక మందుపాతర పేలుడు సంభవించిందని ఆర్మీ వెల్లడించింది. అనంతరం పాకిస్తాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపినట్టు తెలిపింది.
Also Read : మలేషియాలో క్యాంప్.. వైసీపీ బిగ్ ఆఫర్..!
భారత బలగాలు ధీటుగా బదులు ఇచ్చాయని.. భారత సైన్యం నియంత్రణ రేఖపై పట్టు కొనసాగిస్తోందని.. పరిస్థితి అదుపులో ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నియంత్రణ రేఖ వెంబడి శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాల “డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్” మధ్య అవగాహన ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత ఆర్మీ స్పష్టం చేసింది. 2021లో జరిగిన సమావేశంలో, హింసకు దారితీసే సంఘటనలను పరిష్కరించేందుకు ఇరుపక్షాల ఉన్నతాధికారులు అంగీకరించారు.
Also Read : జగన్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..!
అయినా పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఫిబ్రవరి 25, 2021న రెండు దేశాలు ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటికీ.. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు మళ్ళీ పెరిగాయి. కథువాలోని పంజ్‌తిర్తి ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు గుర్తించిన ఆర్మీ.. గాలింపు చేపట్టగా ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. మార్చి 31 రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన అనంతరం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నేతృత్వంలో సంయుక్త ఆపరేషన్ జరిగింది.

