దశాబ్దాలుగా స్వతంత్ర భారతంలో ఓ వెలుగు వెలిగిన మావోయిస్టు ఉద్యమం కనుమరుగవుతోంది. చత్తీస్గడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యంలో దశాబ్దాలుగా తిష్ట వేసిన మావోయిస్టులు ఒక్కొక్కరిగా.. క్రమంగా వందలాదిగా, జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావును.. భద్రతా బలగాలు అంతం చేసిన తర్వాత క్రమంగా మావోయిస్టులు తుపాకులను వీడుతున్నారు. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ కుదేలు అయిపోయింది. భద్రతా బలగాలు దశాబ్దాలుగా అడుగుపెట్టలేని చోట.. గత ఏడాదికాలంగా పెద్ద ఎత్తున విజయవంతమయ్యాయి.
Also Read : అజారుద్దీన్ శాఖ అదేనా..? కానీ మరో అడ్డంకి కూడా..?
గతంలో అడుగుపెట్టలేని చోట, అడవుల్లో సాగుతున్న ఉద్యమానికి ముగింపు పలికే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవల తక్కెళ్ళపల్లి వాసుదేవరావు, మల్లోజుల వేణుగోపాల్, చంద్రన్న సహా కీలక అగ్రనేతలు ముఖ్యమంత్రుల సమక్షంలో లొంగిపోవడంతో ఏం జరగబోతుందా అంటూ అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. వీరితో పాటుగా వందల మంది మావోయిస్టులు తమ తుపాకులను వదిలి భారత రాజ్యాంగాన్ని చేత బట్టారు. అయితే ఏళ్ల తరబడి అడవుల్లో ఉన్న మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎప్పటినుంచో ఉన్న ప్రశ్న. కొన్నాళ్లుగా కాంట్రాక్టర్లు కూడా మావోయిస్టులకు పెద్దగా నిధులు ఇవ్వడం లేదు. ఇక మావోయిస్టులకు ఉన్న ఆదాయం మార్గాలను సైతం భద్రత బలగాలు మూసివేస్తున్నాయి.
దానికి తోడు నోట్ల రద్దు కూడా మావోయిస్టులపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మావోయిస్టుల వద్ద భారీగా నగదు ఉన్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిధుల సేకరణకు వారికి విస్తృత నెట్వర్క్ ఉందని జాతీయ దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ నిధులను కరోనా సమయంలో బంగారంగా మార్చారని గుర్తించింది. తమ పార్టీ సానుభూతిపరుల పేర్లతో డొల్ల కంపెనీలు పెట్టి కోట్ల రూపాయల మళ్లించినట్లు కూడా గుర్తించారు. మావోయిస్టుల వద్ద దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయల నగదు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.
Also Read : భారతి సిమెంట్ మేనేజర్ పై కేసు..!
ఇటీవల మావోయిస్టులకు నగదు అందిస్తున్న కొందరు వ్యక్తులను కూడా గుర్తించి వారి ఖాతాలను సీజ్ చేశారు. ఇక మావోయిస్టుల వద్ద దాదాపు 400 కేజీల బంగారం ఉందనేది జాతీయ దర్యాప్తు బృందం అంచనా. అయితే వీటిని ఎక్కడ దాచారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అభయారణ్యంలో కొన్నిచోట్ల డంపులు ఏర్పాటు చేసి అక్కడ దాచి ఉంచి ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి లొంగిపోయిన కీలక నేతల వద్ద నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నగదును గనుక భద్రత బలగాలు గుర్తిస్తే మాత్రం మావోయిస్టు పార్టీ ఆర్థికంగా కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

