అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మంగళగిరి సమీపంలోని కురగల్లు వద్ద ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా యూనివర్సిటీ అధికారులు గోప్యంగా ఉంచారు. అయితే విషయం బయటకు రావడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టాయి. ఫుడ్ పాయిజన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
Also Read : మనిషి ఇక్కడే ఉన్నా మనసు అక్కడే.. కరణం ఆవేదన
అమరావతిలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు రావాలనే ఉద్దేశ్యంతో ఎస్ఆర్ఎమ్, వీఐటీ, అమృత విశ్వవిద్యాలయాలకు తక్కువ ధరకే ప్రభుత్వం గతంలోనే భూములు కేటాయించింది. వీటిల్లో చేరేందుకు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. అయితే తాజాగా ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ వ్యవహారం పెద్ద దుమారం రేగుతోంది. ఒకేసారి 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటనకు దారి తీసిన కారణాలపై ఆరా తీసేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ప్రభుత్వం నియమించింది. అదే సమయంలో వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై క్షుణ్ణంగా విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు యూనివర్సిటీలో పర్యటించారు. సుమారు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. వారిలో చాలా మందిలో డయేరియా లక్షణాలు, విరేచనాలు, వాంతులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
Also Read : సార్ మీ స్కిన్ కేర్ ఏంటీ..? మోడీతో మహిళా క్రికెటర్ కామెంట్
ఈ ఘటనలో రాజకీయ దురుద్దేశం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతిపైన విషం చిమ్మాలనే కుట్రతో వర్సిటీకి సరఫరా అవుతున్న నీరు కలుషితం చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వర్సిటీలో ఆర్వో వాటర్ మాత్రమే సరఫరా చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. యూనివర్సిటీలో 6 వేల మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో కేవలం 300 మంది మాత్రమే అస్వస్థతకు గురైనట్లు తెనాలి సబ్ కలెక్టర్ తెలిపారు. పూర్తి దర్యాప్తు నివేదికను సాధ్యమైనంత త్వరలో అందిస్తామన్నారు.

