అజిత్ పవార్.. మహారాష్ట్రలోనే కాదు.. దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పగలిగే స్థాయి నేత. శరద్ పవార్ వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన అజిత్ దా.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం అంటే.. అజిత్ కోట అనేలా మార్చేశారు. చివరికి ఆయనను ఎంతో ఆదరిస్తున్న బారామతి వాసుల మధ్యలోనే విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందారు. అయితే అజిత్ అంతిమ యాత్రతో మహారాష్ట్ర రాజకీయాలు ముగిసిపోలేదు. ఆయన తర్వాత పవార్ ఫ్యామిలీలో చక్రం తిప్పే నేత ఎవరూ అనే చర్చ ఇప్పటికే మొదలైంది.
ఇంకా చెప్పాలంటే.. నిజానికి మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడే మొదలయ్యాయి. అజిత్ పవార్ మృతితో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం స్థానంలో ఎవర్ని నియమించాలి అనే చర్చ మొదలైంది. ఇదే ఇప్పుడు మహాయుతి కూటమికి కొత్త సవాలుగా మారింది కూడా. ఇప్పుడు అతి పెద్ద సమస్య ఏమిటంటే.. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్‌సీపీకి ఇప్పుడు నాయకత్వం లేకుండా పోయింది. పవార్ ఆకస్మిక మరణంతో ఎన్‌సీపీ అధ్యక్షులుగా ఎవరుంటారనే చర్చ జోరుగా జరుగుతోంది. నిజానికి అజిత్ పవార్ స్థాయిలో వ్యూహాలు రచించడం అంత తేలికైన విషయం కాదు. అజిత్ పవార్ అత్యంత తెలివైన నేత. మరాఠా రాజకీయాల్లో ఎవరైనా ఆయన తర్వాతే అనే పేరు. బారామతి నుంచి వరుసగా ఆారుసార్లు ఎన్నికైన అజిత్ పవార్… పృధ్వీరాజ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గాల్లో పని చేశారు.
Also Read : సింఘాల్ అవుట్.. టీటీడీ కొత్త ఈవో ఆయనేనా..?
1991లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన అజిత్ దా.. ఆ తర్వాత తన బాబాయ్ శరద్ పవార్ కోసం రాజీనామా చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా ఆరు సార్లు బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికవుతూనే ఉన్నారు. మరాఠ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన అజిత్ పవార్.. ఎన్‌సీపీని శరద్ పవార్ నుంచి లాక్కున్నారు. అలా సొంతం చేసుకున్నపార్టీనే అసలైన ఎన్‌సీపీ అని కోర్టు ద్వారా చెప్పించుకోగలిగిన వ్యూహాత్మక నేత అజిత్ దా. అలాంటి అజిత్ నాయకత్వం ఇప్పుడు ఎన్‌సీపీలో లేదు. ఇదే భారతీయ జనతా పార్టీకి లాభదాయకమైన విషయం కూడా. ఎన్‌సీపపీ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ వైపు తిప్పుకునేలా ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అజిత్ పవార్ లేని లోటును భర్తీ చేసేందుకు కమలం పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఎన్‌సీపీ భాగస్వామిగా ఉంది. పొత్తులో భాగంగానే అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఇప్పుడు అజిత్ లేకపోవడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఫడ్నవీస్ సర్కార్ భావిస్తోంది. ఎన్‌సీపీలో ఆ స్థాయిలో చక్రం తిప్పగలిగిన నేత వేటలో అందరి దృష్టి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ వైపు మళ్లింది. నిజానికి సునేత్ర ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ ఎన్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఉప ముఖ్యమంత్రి పదవి సునేత్రకు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అజిత్ మృతితో ఖాళీ అయిన బారామతి నియోజకవర్గం ఉప ఎన్నికల్లో సునేత్రను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే మాట కూడా వినిపిస్తోంది. ఇందుకు అన్ని పార్టీల నేతలతో చర్చలు జరపాలని సూచిస్తున్నారు.
Also Read : డేంజర్ లో మేడిగడ్డ.. కేంద్రం హెచ్చరిక
సునేత్రను ఉప ముఖ్యమంత్రిని చేస్తే.. పవర్ పవార్ కుటుంబం చేతుల్లోనే ఉంటుందనేది ఎన్‌సీపీ నేతల మాట. అజిత్ దా అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. ఎన్‌సీపీ సీనియర్ నేతలు సునేత్ర పవార్‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. అజిత్ లేని లోటును సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని సూచించారు. ఆలస్యం చేస్తే ఎన్‌సీపీ పై స్పష్టమైన ప్రభావం చూపిస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికలో ఆలస్యం చేస్తే.. అది బీజేపీ సహా ఇతర పార్టీలకు మేలు జరుగుతుందనే హెచ్చరికలు కూడా సీనియర్ నేతలు చేశారు. ఇందుకు శివసేన ఉదంతం గుర్తు చేశారు కూడా. బాల్ థాక్రే మృతి తర్వాత శివసేన ముక్కలైన విషయాన్ని ఉదహరించినట్లు తెలుస్తోంది.
అయితే ఉప ముఖ్యమంత్రి స్థానంలో సునేత్ర పవార్ ప్రయాణం అంత సులువైనది ఏ మాత్రం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బారామతి ఉప ఎన్నికల్లో సునేత్ర ప్రయాణం నల్లేరు మీద నడక. అక్కడ అజిత్ పవార్‌కు మంచి పేరుంది. అందుకే 1991 నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు అజిత్ దా. ఆయన స్థానంలో ఇప్పుడు సునేత్ర పవార్ పోటీ చేస్తే.. భారీ మెజారిటీ ఖాయమనేది వాస్తవం. ప్రస్తుతం సునేత్ర పవార్ ఎన్‌సీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన సునేత్ర.. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు.
Also Read : బోయపాటి బాలీవుడ్ లాంచ్.. ఖాయమేనా?
ఎన్‌సీపీ అధ్యక్షురాలిగా సునేత్ర కాకపోతే.. మరో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయనేది మహారాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. ఎన్‌సీపీ బలపడితే ఆ ప్రభావం బీజేపీపైనే ఉంటుంది. అందుకే ముందు నుంచే ఎన్‌సీపీని ముక్కలు చేసేందుకు బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేసి శరద్ నుంచి అజిత్ పవార్‌ను వేరు చేయడంలో సక్సెస్ అయ్యారనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు అజిత్ పవార్ మృతితో బీజేపీ విస్తరణకు మార్గం సుగమం అయినట్లుగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని బీజేపీ కచ్చితంగా ఉపయోగించుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

