మాటలు మస్తు చెప్తం.. అసెంబ్లీకి రావాలా ఏంది..? ఇదే ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్న మాట. నాలుగు రోజులు క్రితం పార్టీ నేతలతో సమావేశం కోసం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. దాదాపు 8 నెలల తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కాంగ్రెస్ ప్రభుత్వంపైన, కేంద్రంపైన, చివరికి చంద్రబాబు పైన, ఎలాంటి సంబంధం లేని ఏపీ పైన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు పైన కూడా విమర్శలు చేశారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ అదే పాత పాట మళ్లీ మళ్లీ పాడేందుకు ప్రయత్నం చేశారు. పాలమూరు జిల్లా పూర్తిస్థాయిలో నిర్లక్ష్యానికి గురైందని.. ఇందుకు ఏపీ పాలకులే కారణమన్నారు. నీళ్లు, నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అంటూ.. మరోసారి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్.
Also Read : ఇది కూడా సీబీఐకే..? రేవంత్ సంచలన నిర్ణయం..?
2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించారు కేసీఆర్. నిజానికి ఈ పార్టీ ప్రారంభం వెనుక అసలు కారణం వేరు. తనకు మంత్రి పదవి కాకుండా.. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారనే అక్కసుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆగ్రహంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేసీఆర్.. తెలంగాణ వారికి పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది అంటూ ప్రాంతీయ విద్వేషాలకు బీజం వేశారు. ఆ తర్వాత ఉద్యమం పేరుతో వందల మంది ప్రాణాలు పోతున్నా సరే.. దాని గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రసంగాలు ఊదరగొట్టారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. తనను తాను “కాపల కుక్క” గా అభివర్ణించారు కేసీఆర్. కానీ 2014లో తెలంగాణ ఏర్పాటు, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తనను తాను “తెలంగాణ బాపు” గా ప్రచారం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏపీ పైనే విషం చిమ్మారు కేసీఆర్.
Also Read : దుమారం రేపుతున్న దీపక్ వ్యాఖ్యలు..!
నిజానికి ఎగువనున్న రాష్ట్రం దయతలిస్తేనే దిగువనున్న రాష్ట్రానికి నీరు వస్తుంది. కానీ కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలంతా నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ ఇప్పటికే అదే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా నీటి కేటాయింపులు, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని.. అప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. డిసెంబర్ 29 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు వస్తే.. అన్ని వివరంగా చర్చిద్దామన్ననారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ రాకపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసెంబ్లీకి వస్తారా అని కేసీఆర్‌ను సహచర ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. రాలేను.. అక్కడికి వస్తే నన్ను ఇబ్బంది పెడతారు.. కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి.. అప్పుడు పార్టీకే నష్టం అని బదులిచ్చారని.. ఇప్పుడు కొందరు సెటైర్లు వేస్తున్నారు. నిజానికి కేసీఆర్ కూడా ప్రాజెక్టులపై చర్చలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్యేలకు సూచించారు తప్ప.. నేను వస్తా అని ఒక్క మాట కూడా అనలేదు. ప్రెస్ మీట్ అనంతరం 4 రోజులుగా ఎర్రవల్లి ఫార్మ్‌హౌజ్‌లోనే ఉన్నారు కేసీఆర్. ప్రెస్ మీట్ సందర్భంగా 35 సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించి.. 2 రోజుల్లో మళ్లీ వస్తా.. తోలు తీస్తా అని చెప్పి ఫార్మ్ హౌస్ వెళ్లిపోయారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ ఉత్తి మాటలే తప్ప.. ఆయన చేసేది ఏం లేదనే మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది.

