తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగిన వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రసాదం తయారీలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు నిందితులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. నెయ్యి నమూనాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పంపగా, అవి అసలు నెయ్యి కాదని, రసాయనాలతో తయారు చేసిన పదార్థమని నివేదికలో వెల్లడైందని తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కూడా తన నివేదికలో ఇదే విషయాన్ని నిర్ధారించిందని సీఎం పేర్కొన్నారు.
Also Read : చెప్తే అర్ధం కాదా..? ఎమ్మెలపై పవన్ సీరియస్..!
వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, తిరుమల శ్రీవారి ప్రసాద పవిత్రతను దెబ్బతీయడానికి ఎవరికి హక్కు లేదని స్పష్టం చేశారు. గత పాలకులు నాసిరకమైన పదార్థాలతో ప్రసాదాన్ని తయారు చేయించారని, 2024కి ముందు తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులు కూడా ఈ మార్పును గమనించి ఉంటారని అన్నారు. కొనుగోలు చేసిన నెయ్యిని పరీక్షించగా జంతువుల కొవ్వు కలిసినట్లు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయని చెప్పారు. ఈ అక్రమాలను బయటపెడుతుండగా, బాధ్యులు తప్పించుకోవడానికి ఇతరులపై నిందలు మోపడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంలో హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను సీఎం ఖండించారు. కల్తీకి పాల్పడినవారు తమ తప్పును దాచేందుకు హెరిటేజ్‌పై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. దేవాలయం, మసీదు, చర్చి ఏదైనా వాటి పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీటీడీలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించామని తెలిపారు.
Also Read : చెవిరెడ్డిని ఊహించని దెబ్బ కొట్టిన జగన్..!
అదే సమయంలో రాష్ట్రంలో గత పాలనపై కూడా సీఎం తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి, పరిశ్రమలను వెళ్లగొట్టిందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రంలో చెత్త రాజకీయాలు, రౌడీ రాజకీయాలు పెరిగాయని, ప్రజలు వాటిని తిరస్కరించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.
శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మత్తు పదార్థాలు, నేరాలు, మహిళలపై దాడులు వంటి ఘటనలను కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని రక్షించేందుకు ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడుతూ, తిరుమల ప్రసాద పవిత్రతను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు.

