Tuesday, October 13, 2026 01:00 PM
Tuesday, October 13, 2026 01:00 PM

కూటమిలో సీట్ల పంచాయతీ..!

స్థానిక సమరానికి తెరలేసింది. కూటమిలో సీట్లు సర్దుబాటు రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు… స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా తమ పట్టు నిలబెట్టుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్లు పంపకాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమావేశమై నగరపాలక సంస్థల మేయర్ స్థానాలతో పాటు మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో పోటీ చేసి స్థానాలపై చర్చించమన్నారు. ఈ భేటీతో కూటమి పార్టీల్లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో మేయర్ స్థానాల కేటాయింపు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఏ నగరంలో ఏ పార్టీ పోటీ చేయాలి? ఎవరికి ఎక్కడ అవకాశం కల్పించాలి? స్థానికంగా ఏ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది? గెలుపు అవకాశాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? వంటి అంశాల ఆధారంగా సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నాలుగు మేయర్ స్థానాలను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ నగరపాలక సంస్థలతో పాటు తిరుపతి మేయర్ స్థానం కేటాయింపు అంశం కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Also Read : తమిళనాడు సీఎం విజయ్ ఏపీ షెడ్యూల్ ఇదే..!

కేవలం నగరపాలక సంస్థలకే సీట్ల సర్దుబాటు పరిమితం కానుంది కాదు. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాల్లోనూ మూడు పార్టీల మధ్య అవగాహన కుదరాల్సి ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలాబలాలు వేర్వేరుగా ఉండటంతో అన్ని చోట్లా ఒకే విధమైన సూత్రాన్ని అనుసరించడం కష్టంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా పార్టీకి ఉన్న బలం, నాయకుల ప్రభావం, గత ఎన్నికల ఫలితాలు, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంపకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మూడు పార్టీల నేతలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగితేనే స్థానిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయనే భావన కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కోసం ఏర్పాటైన రాష్ట్రస్థాయి, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులపై పరిశీలన జరిపినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉంది? ఎక్కడ ఎవరికి అవకాశం కల్పిస్తే ప్రయోజనం ఉంటుంది? అనే అంశాలపై ప్రాథమిక జాబితాలు రూపొందించినట్లు సమాచారం. ఇటీవల ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఆ చర్చల్లో ప్రాథమిక అవగాహన కుదిరిందనే ప్రచారం నేపథ్యంలో మూడు పార్టీల ముఖ్య నేతల మధ్య జరిగే భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. మూడు పార్టీల అగ్రనేతలు ఏ అంశాలపై ఏకాభిప్రాయానికి వస్తారు? ఏయే స్థానాలను ఎవరికి కేటాయిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read : పెన్షన్.. వివరించకుంటే ప్రమాదమే..!

2024 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఈ విజయంతో ఏర్పడిన రాజకీయ బలాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలని భాగస్వామ్య పార్టీలు భావిస్తున్నాయి. అయితే శాసనసభ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉంటాయి. గ్రామం, వార్డు స్థాయిలో అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, స్థానిక సమస్యలు, సామాజిక సమీకరణాలు, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సీట్ల పంపకాల్లో పరస్పర అంగీకారానికి రావడం కూటమి నాయకత్వానికి ముఖ్యమైన అంశంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ ప్రాతినిధ్యం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ వరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ హామీని ఆచరణలో ఎలా అమలు చేస్తారు? కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో బీసీలకు ఎంత ప్రాతినిధ్యం లభిస్తుంది? ఏయే ప్రాంతాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తారు? అనే అంశాలపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : గుర్రపు స్వారీ ఆటిజం పిల్లల్లో ఇంత మార్పు తెస్తుందా..?

ఒకవైపు మేయర్ పీఠాలు.. మరోవైపు మున్సిపాలిటీలు, జెడ్సీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు.. ఇంకోవైపు సామాజిక సమీకరణాలు, బీసీ ప్రాతినిధ్యం.. ఇలా పలు అంశాల మధ్య కూటమి సీట్ల సర్దుబాటు ప్రక్రియ సాగుతోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పీవీఎన్ మాధవ్ మధ్య జరిగే చర్చలు ఈ ప్రక్రియలో కీలకంగా మారనున్నాయి. గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా సీట్ల పంపకాలు ఉంటాయా? భాగస్వామ్య పార్టీల డిమాండ్లకు ఎంతవరకు ఆమోదం లభిస్తుంది? మేయర్ పీఠాల విషయంలో ఎలాంటి అవగాహన కుదురుతుంది? అన్న ప్రశ్నలకు అగ్రనేతల భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక సమరానికి సిద్ధమవుతున్న కూటమి రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఈ కీలక సమావేశంపైనే!

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఏపీ జడ్పీ ఛైర్మన్...

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు...

మంగళగిరి మేయర్‌ పీఠం...

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి...

ఈడీ టార్గెట్ జగన్.....

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

ఏపీలో మున్సిపల్ సమరానికి...

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న స్థానిక...

బాంబు పేల్చిన రాహుల్.....

దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఓటర్ల...

తమిళనాడు సీఎం విజయ్...

దక్షిణ భారత రాజకీయాల్లో ఆసక్తికర, కీలక...

పోల్స్